వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్ రాజకీయ పార్టీని స్థాపించిన మొదట్లో తన సొంత మీడియా అయిన 'సాక్షి' దినపత్రికకు, 'సాక్షి' టీవీకి తప్పితే తెలుగు మీడియాను ఏ మాత్రం పట్టించుకునే వాడు కాదు. ఈనాడు రామోజీరావుతో పాటు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ అంటే మండిపడి తన మీడియాలో వారిపై అవాక్కులు చెవాక్కులు పేలేవాడు. కేవలం జాతీయమీడియాతోనే ఇంగ్లీషులో మాట్లాడే వాడే గానీ పాపం తెలుగేరానట్లు, తెలుగు లోకల్ మీడియా అంటే అంటరాని పదార్ధంగా చూసేవాడు. కానీ రాను రాను మనం తెలుగు రాష్ట్రాలలో ఉన్నాం.. ఇక్కడి మీడియా సపోర్ట్ లేనిదే కష్టమని గ్రహించాడు. ఎందుకంటే తెలుగువారిలో నేషనల్ మీడియాను చూసేవారు, ఇంగ్లీషు ఛానెల్స్, ఇంగ్లీషు దినపత్రికలు చూసేవారు తక్కువ. ఇక్కడ అందరూ ఆ మూడు పత్రికలనే చదువుతారు... ఆ కొన్ని ఛానెల్స్‌నే చూస్తారు.
ఇక తన సొంత మీడియాలో ఎంత డప్పు కొట్టుకున్నా అది తమ పార్టీ పాంప్లేట్‌గా మారిందన్న విషయం ప్రజలకు, సామాన్యులకు కూడా తెలిసిపోయిందని ఆలస్యంగా గ్రహించాడు. అప్పటివరకు రామోజీరావుని రాజగురువు అని, ఆంధ్రజ్యోతిని తోక పత్రిక అంటూ వెటకారం చేసిన ఆయన ఏపీలో మొదటి మూడు పత్రిలలో అవి కూడా టాప్‌లోనే ఉన్నాయని గ్రహించి, మొదటగా రాజగురువు రామోజీరావును తన ప్రత్యేకహోదా నిరవధిక నిరాహారదీక్షను గుంటూరులో నిర్వహిస్తున్న రెండు రోజులు ముందు ఆయన ముందు సాగిలపడ్డాడు. ఇక జగన్ మొండైతే తాను మహామొండి అనుకున్న రాధాకృష్ణతో కూడా భేటీ నిర్వహించాలని భావించాడు. దానికి రాధాకృష్ణ పెద్దగా సానుకూలత వ్యక్తం చేయలేదు. మాట తప్పేది లేదు... మడం తిప్పేది లేదంటూనే తన తండ్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అంటరాని పత్రికలుగా చూసిన 'ఆ రెండు పత్రికలు' ముందు మోకరిల్లాల్సిన స్థితి వచ్చింది.
తాను మీడియాను పెట్టిందే ఆ ఇద్దరికి పోటీ అనేది కూడా మర్చి మడమ తిప్పి, మాట తప్పి తనకు మీడియా కవరేజ్ బాగా ఇవ్వమని నాడు ప్రత్యేకహోదా దీక్షకు ముందు ఇప్పుడు పాదయాత్రకు ముందు జగన్ రామోజీరావుని తాజాగా కలిసి 40 నిమిషాల సేపు మంతనాలు జరిపాడు. ఇక ఏ ఎండకా గొడుగు పట్టే రామోజీరావు సైతం రెండేళ్ల కిందట జగన్‌తో కలిసిన తర్వాత కాస్త బెట్టు సడలించి తన పత్రికలో, ఛానెల్స్‌లో జగన్‌కి బాగానే కవరేజ్ ఇస్తున్నాడు. తాజాగా జగన్ రామోజీరావుని కలిసేటప్పుడు ఆయన నమ్మిన బంటు భూమా కరుణాకర్‌రెడ్డి కూడా సాక్ష్యంగా ఉన్నాడు. అయినా ఫలానా మీడియా ఫలానా వారికి మద్దుతు అనేది సామాన్యులు మాట్లాడుకోవడానికి, అందులో పనిచేసే కింది స్థాయి విలేకరులకే తప్ప పెద్దలు పెద్దలు ఎప్పుడు ఒకే గొడుగు కింద ఉంటారనే విషయం జగన్ తాజాగా రామోజీతో వేసిన భేటీ నిరూపిస్తోంది.