ఎన్టీఆర్ జీవిత గాధను పుస్తకరూపం ఇచ్చే దశలో లక్ష్మిపార్వతికి ఎన్టీఆర్ దగ్గరయ్యాడు. ముసలి వయసులో ఉన్న తన బాగోగులను దాదాపు 14 మంది సంతానం ఉన్నా కూడా తనను ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే ఎన్టీఆర్ లక్ష్మిపార్వతిని రెండో వివాహం చేసుకున్నాడని, తన కడుపున పుట్టినవారు, అల్లుళ్లు ఇలా అందరూ దూరం పెట్టి తన డబ్బు, పదవి, వారసత్వాలపై మాత్రమే ఆశలు పెట్టుకోవడం ఆ వయసులో ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడని, దాంతోనే తనకు సపర్యలు చేసిన లక్ష్విపార్వతిని రెండో వివాహం చేసుకున్నాడని అంటారు, నిజానికి లక్ష్మిపార్వతి మంచి రచయితే కాదు.. హరికథ కళాకారిణి, తెలుగు లిటరేచర్‌లో డాక్టరేట్ పొందింది. ఈమెకు సామాజిక స్పృహ,రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే.
ఇక ఈమెను ఎన్టీఆర్ 'మేజర్ చంద్రకాంత్' వేడుకలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. 1993లో ఎన్టీఆర్‌ని ఆమె రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె మొదటి భర్త, హరికథా కళాకారుడైన వీరగంధం సుబ్బారావు నానా హడావుడి చేశాడు. తాను తన భార్యను ఎంతో బాగా చూసుకుంటానని కానీ తన భార్యను ఎన్టీఆర్ వలలో వేసుకున్నాడని, ఇప్పుడు తనకు భార్య, తన బిడ్డకు తల్లిని లేకుండా చేసింది ఎన్టీఆరేనని ఆరోపించి, ఎన్టీఆర్‌పై విమర్శలు గుప్పించాడు. అదే ఆరోపణలు మీడియా ముందు కూడా చేశాడు. ఇక తెరమరుగైపోయిందనుకున్న ఈ తేనెతుట్టెను లక్ష్మీపార్వతినే మరలా కలబెట్టడం విశేషం.
ఆమె మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే నా మొదటి వివాహం నాకు ఇష్టం లేకుండానే జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఆ వివాహం జరిగింది. మా అమ్మానాన్నలు కూడా నాడు ఆ పెళ్లిని వ్యతిరేకించారు. మాకు కొడుకు పుట్టిన తర్వాత మేం భార్యాభర్తలం విడిపోయాం. ఆ తర్వాత నేను ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయాను. నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అలాంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎవ్వరూ అన్ని మంచి చేయలేరు. ఎవ్వరూ అన్ని తప్పులే చేయరు. ఆ విషయంలో విమర్శలు, ప్రశంసలు రెండూ ఉంటాయి.. అని చెప్పుకొచ్చింది.
అయినా ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆమె ఎన్టీఆర్‌ని వివాహం చేసుకోవడం ఆశ్చర్యకరమే. అయినా ఆమె ఏ ఉద్దేశ్యంతో చెప్పిందో గానీ అన్నిమంచి, అన్ని చెడు అనేవి ఎక్కడా ఉండవు. ఎవరూ ఈ విషయంలో తామే పర్‌ఫెక్ట్ అనుకోవడానికి వీలులేదు. ఎవరి కోణంలో వారి ఆలోచనలు ఉంటాయనేది వాస్తవం.