తెలుగులో ఎప్పుడో తప్పితే పొలిటికల్ సైటర్ల చిత్రాలు రావు. వచ్చినా కూడా ఏదో కాకతాళీయంగా డైలాగ్‌లు, సీన్లు ఉంటాయి. లేదా పదవిలోలేని వారి గురించి, ఎప్పుడో జరిగిన సంభాషణలను ప్రస్తావిస్తారు తప్పితే అధికారం చేతిలో ఉన్న వారు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా బాధ్యతాయుతమైన మీడియాగా, శక్తివంతమైన, ప్రజలను జాగరూకులను చేసే మీడియాగా పేరున్న సినిమాలలో వాటిని ప్రస్తావించరు. అలాగే ఎవరైనా తీసే ప్రయత్నం చేసినా కూడా వారికి నైతికమద్దత్తు తెలిపి, మీ వెనుక మేమందరం సమష్టిగా ఉన్నామనే భరోసా ఇవ్వరు. ఇక స్టార్స్ అయితే పాము చావకూడదు.. కర్ర విరగకూడదనే సామెతనే పాటిస్తారు. నాడెప్పుడో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ తీసిన చిత్రాలు, ఎప్పుడో దాసరి తీసిన 'ఎమ్మెల్యే ఏడుకొండలు, మేస్త్రి' వంటివి తప్పితే మనకు రాజకీయ చైతన్యం కలిగించే చిత్రాలు తక్కువ.
ఇక ఎవరైనా ప్రభుత్వాల లోటుపాట్లను ప్రస్తావిస్తే మన హీరోలు, అభిమానులు, సినీ పెద్దలు కూడా కులాలు, మతాల ప్రకారం మాత్రమే స్పందిస్తారు. ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన విజయ్ 'మెర్సల్' చిత్రంలో మోదీని, జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, కార్పొరేట్ వైద్యాన్ని తేకపోవడంపై మాములుగా కాకుండా ఘాటుగానే సెటైర్లు పేలాయి. ఇక డాక్టర్లు ఉన్నది ప్రజలను, పేషెంట్లను దోచుకోవడానికి తప్పితే పేషెంట్లను పట్టించుకోరని ఆలోచింపజేసే డైలాగ్స్‌ని వినిపించారు. తెలుగులో కంటే తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు అనుబంధమే కాదు.. రాజకీయ నాయకుల కక్ష్య సాధింపు కూడా ఎక్కువే. అయినా అట్లీ, తేనాండ్రల్ మూవీస్ అధినేతలు, విజయ్ వెనడుగు వేయలేదు.
దీంతోకులాలకు, మతాలకు, స్టార్‌డమ్‌లకు అతీతంగా విజయ్ తమ తోటి పోటీదారు, తమతో పోటీ పడుతున్న స్టారే అయినా కూడా రజనీకాంత్, కమల్‌హాసన్, దర్శకుడు రంజిత్‌పా, డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వంటి వారి మద్దతు లభిస్తోంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే అందించిన విజయేంద్రప్రసాద్ కూడా దీనికి మద్దతు ప్రకటించాడు. వెనక్కి తగ్గవద్దని, మీకు మేమున్నామని కమల్ భరోసా ఇస్తే.. ప్రజల సమస్యలను చూపితే ఎలా రాజకీయం అవుతుంది? ఈ చిత్రంలో చూపించింది వాస్తవమేనని దర్శకుడు రంజిత్‌పా తెలిపాడు.
ఇక రజనీ..ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. శభాష్.. 'మెర్సల్' బృందానికి నా అభినందనలు.. అని చెబుతూ, తాను బిజెపి సానుభూతి పరుడైనా కూడా ఈ చిత్రానికి మద్దతు ప్రకటించాడు. నిజానికి ఎవరైనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసి, ప్రజలకు తమ పంధా, తమ భావజాలం ఏమిటో జనాలకు తెలపాలి. నాటి 'సర్దార్ పాపారాయుడు'లో కూడా ఎన్టీఆర్ అదే చేశాడు. ఇక పవన్ అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తూనే వున్నాడు!