అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక మెతుకును చూస్తేనే అర్ధమవుతుంది. ఇక తెలుగు నటి అయిన సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభానికి గానీ తర్వాత గానీ అందులోని పాత్రలకు సూటబుల్ ఆర్టిస్టులను ఎంచుకుంటేనే చిత్రం హిట్టవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత కష్టపడినా రాంగ్ క్యాస్టింగ్ చేస్తే మాత్రం ఆ ఫలితం సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఇప్పటికే ఎన్నోచిత్రాల ద్వారా నిరూపితమైంది. అందునా బయోపిక్ అంటే పాత్రల ఎంపికలో మరింత ఖచ్చితత్వం ఎక్కువగా ఉండాలి. సరైన ఆర్టిస్టులు లేక. లేదా తమ చిత్రాలలోని పాత్రలకు ఎవరైతే సరిపోతారని భావిస్తారో వారు ఆ చిత్రాలను ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్ట్‌లనే పూర్తిగా పక్కనపెట్టేసిన సంఘటనలు ఉన్నాయి.
దీనికి ఓ ఉదాహరణ బాలయ్య నటిస్తూ, దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' అందులో దౌపద్రిగా అనుకున్న సౌందర్య మరణించడంతో ఆ ప్రాజెక్టే ఆగిపోయింది. ఇక అనవసరం అనవచ్చు గానీ బయోపిక్‌ల విషయంలో వర్మ ఎంపికే ఎంపిక. అదిరిపోయేలా తాననుకున్న ఆర్టిస్టులను వెతికి వెతికి ఆయన పట్టుకుంటారు. ఇప్పుడు 'మహానటి' సావిత్రి బయోపిక్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రంలోని ఆయా పాత్రల కోసం ఎంత రీసెర్చి చేసి ఎంతగా కష్టపడుతున్నాడో ఆయన ఎంచుకుంటున్న ఆర్టిస్టులను బట్టి తెలిసిపోతోంది. ఇందులో మహానటి సావిత్రిగా కీర్తిసురేష్‌ని ఎంపిక చేయడంతోనే ఆయన సగం క్రెడిట్ కొట్టేశాడు. ఇక నెగటివ్ షేడ్స్ ఉండే సావిత్రి భర్త పాత్ర జెమిని గణేషన్‌గా ఎవ్వరూ ఒప్పుకోకపోతే దుల్కర్‌సల్మాని పెట్టుకున్నాడు. ఆ మద్య దుల్కర్ గెటప్‌ని రివీల్ చేస్తే అచ్చు జెమిని గణేషన్‌లాగానే ఉన్నాడని ప్రశంసలు లభించాయి.
ఇక సావిత్రి బయోపిక్‌ని రీసెర్చ్ చేసే జర్నలిస్ట్‌గా సమంత, జమునగా 'అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలిని పాండే, ఎస్వీరంగారావుగా మోహన్‌బాబులను ఎంపిక చేసిన ఆయన నాటి సుప్రసిద్ద దర్శకుడు, సావిత్రితో పలు చిత్రాలు తీసి, ఆమెకు సన్నిహితుడైన కె.వి.రెడ్డి పాత్రకు దర్శకుడు క్రిష్, ఆయన అసిస్టెంట్‌గా 'మాయాబజార్' కి పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు పాత్రకు 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్‌భాస్కర్‌ని ఎంచుకోగా తాజాగా 1960-70లలో సావిత్రి నటించిన ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన పింగళి పాత్రకు 'మహానటి'కి రచయితగా పనిచేస్తున్న సాయి మాధవ్ బుర్రానే ఎంచుకున్నాడు. ఇలా పాత్రల ఎంపికలో నాగ్ అశ్విన్ తన మార్కును చూపిస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రంలో ప్రకాష్‌రాజు నిర్మాత చక్రపాణి పాత్రకు ఎంపికయ్యాడని వార్తలు వచ్చినా తాజాగా ప్రకాష్‌రాజు చేసేది ఎన్టీఆర్, విజయ్‌దేవరకొండ చేసేది ఏయన్నార్ పాత్రలనే వార్తలు వస్తున్నాయి. బహుశా ఇవి పుకార్లే కావచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్‌గా నడి వయస్కుడైన ప్రకాష్‌రాజ్‌ని ఎంపిక చేసుకుంటూ, విజయ్‌దేవరకొండ వంటి యంగ్ ఆర్టిస్టుని ఏయన్నార్‌గా తీసుకునే అవకాశమే లేదని చెప్పవచ్చు.