ఎన్టీఆర్ ఎంతో కాలం నుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి అని ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ ఎదురు చూపులు ఒక కొలిక్కి వచ్చినట్టే. సోమవారం ఉదయం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 28 సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న త్రివిక్రమ్ - ఎన్టీఆర్ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామానాయుడు స్టూడియో లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాకి మొదటి క్లాప్ కొట్టడమే కాక చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశాడు.
ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి, కొడుకు అభయ్ రామ్ తో హాజరయ్యాడు. అలాగే త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా హాజరయ్యారు. అలాగే ఈ వేడుకకి గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్... ఎన్టీఆర్ తో సరదాగా ముచ్చటిస్తూ చాలా సరదాగా కనబడమే కాకుండా ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ లు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. మరి వీరిద్దరూ అలా ఫోటోలకు ఫోజులివ్వడం చూసిన ఎన్టీఆర్ అభిమానులు,. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో పొంగిపోయారు. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ తో ఎంతో ఆత్మీయంగా మాట్లాడడం చూస్తుంటే మాత్రం కన్నుల పండుగగా కనబడుతుంది.
అయితే పవన్ కళ్యాణ్... ఎన్టీఆర్ సినిమా అతిధిగా రావడానికి తన సినిమా షెడ్యూల్ వాయిదా వేసుకున్నాడని టాక్ వినబడుతుంది. త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్... PSPK25 చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకోవడానికి రెడీగా వుంది. అయితే PSPK 25 చిత్ర దర్శకుడు, ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు త్రివిక్రమే కాబట్టి ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కోసం త్రివిక్రమ్ ఉండిపోవడం.. ముఖ్య అతిధిగా పవన్ ని రమ్మని కోరడంతో పవన్ కళ్యాణ్ తన చివరి షెడ్యూల్ ని రెండు రోజులు వాయిదా వేసుకున్నాడని అంటున్నారు. ఇక రెండు రోజుల్లో PSPK 25 చిత్ర బృందం చివరి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మంచి రోజు కావడంతో ఈ రోజు సోమవారం పూజ కార్య క్రమాలతో మొదలైనప్పటికీ.. సెట్స్ పైకెళ్ళేది మాత్రం జనవరిలోనే అంటున్నారు.