యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్....ఆరడుగుల హైట్, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్, అందరినీ ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తూ, అందరికీ దగ్గరైన టాలీవుడ్ డార్లింగ్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా 'ఈశ్వర్' చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. 'రాఘవేంద్ర', 'వర్షం', 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు', 'బిల్లా', 'ఏక్‌నిరంజన్', 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'రెబల్', 'మిర్చి' వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. అయితే రెండేళ్ల క్రితం విడుదలైన 'బాహుబలి ది బిగినింగ్', ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన 'బాహుబలి 2'తో తిరుగులేని క్రేజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ఈ రెండు పార్టుల కోసం ప్రభాస్ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవడానికి వేసిన ప్రతి అడుగులో కృషి, పట్టుదల, దీక్ష.. ప్రభాస్‌ని కోట్లాది మందికి చేరువ చేశాయి.
బాక్సాఫీస్ బాహుబలి..
బాహువుల్లో అమితమైన బలవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు అమరేంద్ర బాహుబలి. ఇలాంటి ఓ నాయకుడిని తెరపై ఆవిష్కరించాలంటే తేలికైన విషయం కాదని రాజమౌళికి తెలుసు. కథను సిద్ధం చేసుకోగానే ప్రభాస్‌ను కలిసి కథ చెప్పాడు. అంతా ఓకే అయ్యింది. రెండేళ్లలో బాహుబలి ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే రేండేళ్లు కాస్తా ఐదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా ఓ కమిట్‌మెంట్‌తో సినిమా చేయడమంటే మరో హీరో ఎవరైనా ఎందుకా అని ఆలోచించేవారు. కానీ ప్రభాస్ మాత్రం ఆలోచించలేదు. ఐదేళ్లు బాహుబలి గురించే తపన పడ్డారు. మరో సినిమా చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన తపన, రాజమౌళి కృషి కలయికే బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు అమరేంద్ర బాహులి, మహేంద్ర బాహుబలి స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో కలెక్షన్స్ రూపంలో బదులిచ్చారు...అది కూడా రికార్డుల రూపంలో బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు.
బాహుబలి రిలీజ్ ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్ ఓ వందకోట్లు ఉంటే..రిలీజ్ తర్వాత ఆ రేంజ్ పాతిక రెట్లు పెరిగింది. దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసే ఉత్తరాదివారిని నోర్లు వెళ్లబెట్టేంత కలెక్షన్స్ కుంభవృష్టిని కురిపించింది. సినిమా విడుదలైన ప్రతిచోట కళ్లు తిరిగే వసూళ్లును రాబట్టుకుంది. ఈ ఏడాది వచ్చిన బాహుబలి 2 తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కొక్క దగ్గర వందకోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం దక్షిణాదిన మాత్రమే దాదాపు 700 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే ఉత్తరాదిన 520 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. మిగిలిన దేశాల్లో కలెక్షన్స్ అంతా చూస్తే రెండో పార్ట్ మాత్రమే 1700 కోట్లను రాబట్టుకుంది. బాహుబలి మొదటి భాగం 700 కోట్లరూపాయలను వసూలు చేసింది. దీంతో ప్రపంచ సినిమాయే తెలుగు సినిమాకు ఇంత పెద్ద మార్కెట్ ఉందా? అసలు బాహుబలి సినిమా ఏంటి? ఎవరీ ప్రభాస్? అని అందరూ డిస్కస్ చేసుకునేలా చేసిన బాక్సాఫీస్ బాహుబలి మన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్‌లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్‌ను సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్ తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్ హీరో అయ్యారు. రాజమౌళి టేకింగ్, ప్రభాస్‌యాక్టింగ్ కలవడంతో సినిమా సెన్సేషన్స్‌కు కొదవలేకుండా పోయింది. పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూనివర్సల్ హీరోగా ప్రభాస్ ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారు మన డార్లింగ్ ప్రభాస్. ఒకప్పుడు బాలీవుడ్‌లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు ప్రభాస్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్ ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్‌కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్‌గా యావరేజ్ సక్సెస్‌ను సాధించిన సినిమాలు కూడా సోషల్ మీడియాల్లో, డబ్బింగ్ వెర్షన్స్‌లో సూపర్‌హిట్ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్ చూసిన చిత్రాలుగా నిలిచాయి.
అంతర్జాతీయ గుర్తింపు..అరుదైన గౌరవం
భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్ నిలిచారు. ఇప్పుడు ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు.
అందరి చూపు..'సాహో' వైపే
బాహుబలితో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్ సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 150 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చిత్రాన్ని హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మిస్తుంది. అల్రెడి విడుదలైన ఈ సినిమా టీజర్, ప్రభాస్ లుక్స్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా మేకింగ్ కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదు. యాక్షన్ థ్రిల్లర్‌లో కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌తో పాటు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ ఎహ్‌సాన్ లాయ్‌లు పనిచేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'సాహో' మూవీ మేకింగ్ వీడియో, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తుంది చిత్ర యూనిట్. ఇప్పుడు ప్రభాస్ టాలీవుడ్ హీరో కాదు.. ఆల్ ఇండియా స్టార్. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఆయన సినిమాలు నిర్మాణం జరుపుకోనున్నాయి. ఇటు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా 'డార్లింగ్' అని పలకరించే ప్రభాస్‌ని అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సినీజోష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.