జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో ఒక సినిమా తెరకెక్కబోతుందనే న్యూస్ ఆఫీషియల్ గా ఎప్పుడో ఎనౌన్సమెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అనేది మాత్రం నిన్నటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ దర్శకుడిగా పవన్ PSPK 25 చిత్రం ఇంకా పూర్తికాని కారణంగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అంటే ఇప్పటివరకు ఎవరు సరైన తేదీ చెప్పలేకుండా ఉన్నారు. ఇక ఎవరికి తోచినట్టు వారు పవన్ - త్రివిక్రమ్ చిత్రం జనవరి 10 న విడుదలవుతుంది కాబట్టి... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల చిత్రం జనవరి నెలాఖరున అయినా... లేకుంటే ఫిబ్రవరిలో గాని మర్చి లోగాని సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు.
ఇక 'జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ కి నాలుగైదు నెలల గ్యాప్ తప్పదనే ప్రచారము జరిగింది. అయితే ఇప్పుడు అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సోమవారం అంటే అక్టోబర్ 23 న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకోనున్నట్లుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కబోతున్న ఈ సినిమా పూజ కార్యక్రమానికి త్రివిక్రమ్ ఫ్రెండ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవడమే కాక పూజ అనంతరం ఎన్టీఆర్ పై తొలి క్లాప్ కొడతాడని సమాచారం అందుతుంది. ఇక మంచిరోజున పూజ కార్యక్రమాలతో మొదలయ్యే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మరి ఎన్టీఆర్ సినిమా పవన్ కళ్యాణ్ క్లాప్ అనగానే అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే వేదిక మీద కలవడం అనేది ఈ మధ్యన కామన్ అయినప్పటికీ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కలయిక మాత్రం కొత్తే. అందుకే ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఈ ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.