వర్మ ఎలాంటి వాడైనా సరే.. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన సుగుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. దేనికీ భయపడకపోవడం, తనను విమర్శించే వారికి సోషల్ మీడియా ద్వారానే కౌంటర్ ఇవ్వలేని ఎన్‌కౌంటర్ల వంటి సెటైర్లు పేల్చడం ఆయన నైజం, ఎన్ని వివాదాలు, విమర్శలు వస్తున్న నవ్ముతూ, సహనం కోల్పోకుండానే తిరిగి సమాధానం లేని సెటైర్లు విసురుతాడు. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న వైసీపీనేత రాకేష్‌రెడ్డి మాత్రం ఓ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ సహనం కోల్పోయాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్‌కి వీరాభిమానిని, దాంతోనే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. వర్మలోని క్రియేటివిటీ అద్భుతమని చెప్పాడు.
ఇక ఇందులో రోజా లక్ష్మీపార్వతి పాత్రలో నటిస్తుందా? లేదా? అన్నది త్వరలో చెబుతానని చెప్పిన ఆయనను యాంకర్.. 'ఎన్టీఆర్‌ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని విపక్షాలు అంటూ ఉంటాయి. అవ్వన్నీ చిత్రంలో ఉంటాయా? అని అడిగితే అన్ని ఉంటాయి.. కానీ ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడవడం మీరు చూశారా? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడవలేదని మీరు చెబుతున్నారా? అని యాంకర్ తిరిగి ప్రశ్నిస్తే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అసహనం వ్యక్తంచేశాడు. ఇవ్వన్నీ సినిమాలో చూడాలి. నేను సినిమా మీద మాట్లాడాలని ఛానెల్‌కి వచ్చాను. రాజకీయాలపై మాట్లాడటానికి రాలేదు.
నాకు ఈ సినిమా తీసేంత డబ్బు లేదని, జగనే ఈ చిత్రానికి ఫైనాన్స్ చేస్తున్నారన్న వాటిపై స్పందిస్తూ.. నా వద్ద డబ్బు లేదని నిరూపిస్తే.. మీరు చెప్పింది చేయడానికి నేను సిద్దం.. లేకపోతే మీ ఛానెల్‌ని క్లోజ్ చేస్తారా? ఇక వైసీపీకి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఆవిషయాలు మాట్లాడవద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక తానూ రాయలసీమలోనే పుట్టానని, ఈ చిత్రం వల్ల సమస్యలు వస్తే తాను ఎదుర్కోగలనని చెప్పుకొచ్చాడు. అంటే ఆయన దృష్టిలో రాయలసీమ వారంటే అభిప్రాయం ఏమిటి? అనేది తెలియాలి. అయినా సినిమా పూర్తయ్యేలోపు సహనంగానే ఉంటూ సెటైర్లు వేయడం ఎలా అనేది వర్మ నుంచి ఈ రాకేష్‌రెడ్డి నేర్చుకుంటాడని భావించవచ్చు. ఎందుకంటే ఆరునెలల సావాసం చేస్తే వారు వీరవుతారని మన పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే.