సినిమాలు తీశామంటే తీశామని కాదు.. ఎన్ని సినిమాలు తీశామనే దాని కంటే ఎన్ని మంచి చిత్రాలు తీశామన్నదే ముఖ్యమని భావించే దర్శకుడు సుకుమార్. అందుకే ఆయన తన సినిమాలను లేట్ అయినా లేటెస్ట్‌గా అందిస్తుంటాడు. నటనలో కమల్, విక్రమ్, అమీర్‌ఖాన్‌లు ఎంత పర్‌ఫెక్షనిస్ట్‌లో దక్షిణాది దర్శకుల్లో శంకర్, రాజమౌళిల తర్వాత అంతటి పర్‌ఫెక్షనిస్ట్‌గా సుకుమార్ పేరును చెప్పాలి. తన చిత్రాలలో హీరో లుక్, గెటప్ నుంచి అన్ని ఆయన శాటిస్‌ఫై అయ్యేదాకా అమరశిల్పి జక్కన్నగా శిల్పాన్ని చెక్కే దర్శకుడు ఈయన. అందుకే ఈయనకు అతి తక్కువ చిత్రాలతోనే క్రియేటివ్ జీనియస్ అనే పేరు వచ్చింది. ఇక ఏ సినిమాకైనా ఆర్ట్ వర్క్ అనేది ఎంతో ముఖ్యం. సినిమాలో ఆర్ట్ వర్క్ ద్వారా ప్రేక్షకులను ఆ పరిస్థితులలోకి తీసుకెళ్లి నాటి కాలంలో ఉన్నామనే ఫీల్‌ని తెప్పించే అత్యంత క్లిష్టమైన పని ఆర్ట్ వర్క్. ఇది పీరియాడికల్ మూవీలకు మరింత ముఖ్యం.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ రామ్‌చరణ్, సమంతలతో 'రంగస్థలం 1985' అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే ఆలస్యమవుతోందని అభిమానులు, ప్రేక్షకులు ఫీలవుతున్నా కూడా చిత్రీకరణ విషయంలో ఎలాంటి హడావుడి పెట్టకుండా రిలీజ్ డేట్‌ని గానీ కనీసం ఏ సీజన్‌లో రిలీజ్ అవుతుందనే క్లారిటీని కూడా సుకుమార్ ఇవ్వడం లేదు. ఇక ఈ చిత్రం కోసం ౧౯౮౫ నాటి ఇటుకల మిద్దెలు, బీళ్లు వారిని ఇల్లు, మట్టి, రేకుల ఇళ్లు, నాటి గోలీ సోడాలు, గోల్డ్‌స్పాట్ పానీయాలు, కిరాణా షాపులు, రోళ్లు, రోకళ్లు, ఎడ్ల బండ్లు, మట్టి కుండలు, పిండిమరలు వంటివన్నీ ఉన్న ఫోటోలను రామ్‌చరణ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇవి ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడమే కాదు.. నాటి కాలానికి మనల్ని తీసుకెళ్లి నాటి అనుభూతులను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చరణ్ కూడా వీటినిచూస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అంటున్నాడు. నిజమే నేడు 30 ఏళ్లు దాటిన వారందరికీ నాటి మధురస్మృతులు ఈ ఫోటోల ద్వారానే కలుగుతున్నాయంటే.. ఇక సినిమా చూస్తే ఎలాంటి ఫీల్ కలుగుతుందో అనే ఆసక్తి మొదలైంది.