మనకున్న విలక్షణ నటుల్లో మోహన్‌బాబు ఒకరు. డైలాగ్ డెలివరీకి ఒక కొత్త రూపుతెచ్చి, కథనాయకుడి పాత్రలకు ధీటైన ప్రతినాయకుడి పాత్రలు చేసి మెప్పించారు. ఇక సాంఘికం, పౌరాణికం, మైథలాజికల్, ఫాంటసీ..ఇలా ఏ తరహా చిత్రమైన తనకిచ్చిన పాత్రకు 100శాతం న్యాయం చేసే నటుడు ఆయన. క్రూరమైన విలనిజమే కాదు.... కామెడీ విలన్‌గా కూడా ఎన్నో పాత్రలలో జీవించారు. మొదట్లో చిన్నచిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, విలన్‌గా, కామెడీ విలన్‌గా, హీరోగా, నిర్మాతగా కూడా సంచలనం సృష్టించాడు ఈ భక్తవత్సలం నాయుడు.
ఇక ఆయన హీరోగా చేసిన 'అల్లుడుగారు. రౌడీగారి పెళ్లాం, పెదరాయుడు' వంటి సినిమాలతో హీరోగా కూడా రికార్డులు బ్రేక్ చేశాడు. ఇక ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రంగా, ఆయన నటవిశ్వరూపాన్ని చూపించిన చిత్రంగా 'యం.ధర్మరాజు ఎం.ఏ' చిత్రాన్ని చెప్పవచ్చు. ఈ చిత్రం ఎందుకు ఆడలేదో ఎవ్వరికీ అర్ధం కాని విషయం. ఇందులో తండ్రి పాత్రలో విలన్‌గా, కొడుకు పాత్రలో హీరోగా నటించాడు. కానీ ఈయన ఈ మధ్య వేషాలు బాగా తగ్గించి, తన తనయుల కెరీర్‌పై దృష్టిపెట్టాడు.
'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం తర్వాత ఆయన కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ తాజాగా మదన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇందులో ఆయన హీరోగానే కాకుండా ప్రతినాయకుడి పాత్రను కూడా చేస్తున్నాడని సమాచారం. ఈ మూవీతో తను మంచి హిట్టు కొట్టి మరలా బిజీగా మారనున్నాడని, మరో చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నట్లు సమాచారం.