సుకుమార్ సినిమాలలోకి రాకముందు లెక్కల మాస్టారిగా పనిచేశాడు. తన చిత్రాల టైటిల్స్ నుంచి కథ, కథలోని సంభాషణలు కూడా మేథమేటిక్స్ టీచర్ పెట్టే పరీక్షను మించి ఉంటాయి. పర్సెంటేజ్‌లు, డిగ్రీలు,కోణాల గురించే చెబుతూ సామాన్యమైన ప్రేక్షకులు ఆయన చిత్రం అంటేనే మనకు అర్ధమై చావదులే అనే విధంగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన చిత్రాలు, స్క్రీన్‌ప్లే ఎంత గొప్పగా ఉన్నా అవి ఒక పట్టాన అర్ధం కావు. సామాన్య ప్రేక్షకులు పది సార్లు చూసినా ఆయన చెప్పేది ఏమిటో వివరించలేరు. దాంతోఆయనకు క్రియేటివ్ జీనియస్‌గా పేరొచ్చి సినిమా ఎంత బాగున్నా బాక్సాఫీస్ వద్ద తేడాలొచ్చేస్తూ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని సామాన్యులను ఆకట్టుకోలేని ఆయన చిత్రాలు ఓవర్‌సీస్‌లో మాత్రం అదరగొట్టడానికి ఇదే కారణం.
ఇక ఆయన తాను తీసే ప్రతి చిత్రం ముందు..ఇది సింపుల్ కథ.. అందరికీ అర్ధమయ్యే సింపుల్ స్టోరీ అని చెబుతుంటాడు. కానీ థియేటర్‌కి వెళ్లితే అది ఆయన పంధాలోనే ఉంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేస్తున్న సినిమా కూడా సింపుల్ విలేజీ స్టోరీ అని చెబుతూనే 'రంగస్థలం 1985' అని టైటిల్ పెట్టడంతో అభిమానులు కంగారులో ఉన్నారు. ఇక ఆయన తాజాగా దీపావళి విషెష్‌ని కూడా తనదైన శైలిలో చెప్పాడు.
షిఫ్ట్ ప్లస్ డిలేట్‌ని కరెంట్ దీపాలకు, కంట్రోల్ ప్లస్ ఎస్‌ని దీపావళి ప్రమిదలకు అన్వయించి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అంటే కీబోర్డులో షిఫ్ట్ ప్లస్ డిలెట్ కొడితే మేటర్ డిలెట్ అవుతుంది. అంటే దీపావళి రోజున కరెంట్ దీపాలను ఆర్పివేయాలని, కంట్రోల్ ప్లస్ ఎస్ అంటే మేటర్ సేవ్ అవుతుంది. అంటే దీపావళిరోజు దీపావళి దీపపు వెలుగులు విరజిమ్మాలని సుకుమార్ ఉద్దేశం. ఇలా దీపావళికి కూడా తన సందేశంతో ఆకట్టుకున్న సుకుమార్‌ని చూసి గర్వపడాలా? లేక సామాన్యులకు అర్ధంకాని మేధావితనం గురించి బాధపడాలా? అనేది ఈ శుభాకాంక్షలు చదివిన వారి ఇష్టమనే చెప్పాలి. అయినా దీపావళికి కనీసం 'రంగస్థలం 1985' గురించి, దాని రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తాడనుకుంటే ఆయన షిఫ్ట్ ప్లస్ డిలేట్ కొట్టాడనే సెటైర్లు వినిపిస్తున్నాయి.