రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రోజు వార్తల్లో నానుతున్న పేరు. తాను హైలెట్ అవడానికి ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీ చేసే రామ్ గోపాల్ వర్మ.. సినిమా ఇండస్ట్రీలోని అందరిని కెలికినవాడే. సినిమా పరిశ్రమలోని పెద్దలని కెలికి కెలికి తిట్లు తిన్నా.. మారని వర్మ ఇప్పుడు రాజకీయ నాయకులను కెలకడం మొదలు పెట్టాడు. రాజకీయ నేతలను ఉడికించి తాను లాభం పొందుతున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇంకా సెట్స్ మీద కెళ్ళకుండా ఆ సినిమాపై విపరీతమైన క్రేజ్ సంపాదించేశాడు. సినిమా ప్రకటించక ముందే ఈ సినిమాకి కావలసినంత క్రేజ్ సంపాదించిన వర్మ పబ్లిసిటీ ఎప్పుడూ ఇలానే ఉంటుంది.
వర్మ తెరకెక్కించే బయోపిక్స్ లో సినిమా కథ.. దానిని ఎలా చూపిస్తాడో అనేదిపక్కన పెడితే... ఆ సినిమాలో ఎవరిని బ్యాడ్ చేసి చూపెడతాడో అనే ఆసక్తిలోనే ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకుంటారు. అసలు వర్మ తీసిన బయోపిక్స్ ఒక్కటి హిట్ అయిన దాఖలాలు లేవు. అయినా వర్మ సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాకి పబ్లిసిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అంతకన్నా ఎక్కువ అంచనాలు, క్రేజ్ ఏర్పడిపోతాయి. ఇక ఇప్పుడు మాత్రం రెండు రాజకీయ పార్టీలలో వర్మ ఒకదానితో సాన్నిహిత్యంగా ఉంటే మరొక దానితో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి నిర్మాతగా ఒక రాజకీయ పార్టీ నేతను పెట్టుకుని మరొక రాజకీయ పార్టీలో అగ్గి రాజేసాడు. ఇక రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలకు సోషల్ మీడియా సాక్షిగా వర్మ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం.... ఇలా ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ తో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాతో పాటే మీడియాని వదలడం లేదు. ఒక్కరోజు వర్మ గురించి రాలేదు అనుకునే లోపే వర్మ ఎవరికో ఒకరికి కౌంటర్ ఇచ్చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. సినిమా మొదలు పెట్టి విడుదల చేసే వరకు ఇదే రకమైన పబ్లిసిటీని కోరుకుంటున్నాడు వర్మ. దాదాపు వర్మ పాచిక 110 శాతం పారినట్టే. పైసా ఖర్చు లేకుండా విపరీతమైన పబ్లిసిటీ తో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే స్పందించడం మాత్రం సామాన్యమైన విషయం కాదు. ఈ రేంజ్ లో వర్మ తన సినిమాకి పబ్లిసిటీ చేసుకుని మరీ సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు.