ఏ నటుడైనా బాగా నటిస్తే బాగా నటించావు అని అభినందించడం వేరు. అది గురువులుగా, పెద్దలుగా, తల్లిదండ్రుల బాధ్యత, అందులో పిల్లలకు ప్రోత్సాహం అందించే విధంగానే అవి ఉండాలి. కనీసం చిన్నపిల్లలని ఎంత టాలెంట్ ఉన్నా ఓపెన్‌గా అతిగా పొగడకూడదని మన పెద్దలు చెబుతారు. ఇక బాలనటులుగా ఎందరినో మెప్పించిన హరీష్, తరుణ్ నుంచి రమేష్‌బాబు, హరికృష్ణలు కూడా తర్వాత కాలంలో ఎంత అండ ఉన్నా హీరోలుగా మెప్పించలేకపోయారు. ప్రస్తుతం పూరీ కొడుకు ఆకాష్‌పూరీది కూడా అదే పరిస్థితి. ఇక విషయానికి వస్తే 'రాజా ది గ్రేట్'లో చిన్నప్పటి రవితేజలా ఆయన కొడుకు మహాధన్ నటించాడు. బాగానే పెర్ఫార్మెన్స్ చేశాడు. ఎక్కడా ఇది తన మొదటి చిత్రం అనే ఫీలింగ్‌ని ఆ బాబు తేలేదు. కాబట్టి అతను నిజంగా ప్రశంసలకి అర్హుడే.
కానీ దిల్‌రాజు మాత్రం ఆ పిల్లాడిని అభినందించడం పోయి ప్రశంసలు కురిపించాదు. అభినందించడంవేరు.. ప్రశంసలు గుప్పించడం వేరని దిల్‌రాజుకి తెలియకపోవచ్చు. ఈ చిత్రంలో రవితేజ కుమారుడి చేత పాత్ర చేయిద్దామని దర్శకుడు అనిల్ చెబితే రవితేజ ఒప్పుకుంటాడా? అని నేను అడిగానని, మీరు కామ్‌గా ఉండండి .. నేను ఒప్పిస్తానని చెప్పి చేసి చూపించాడని అంటూ మహేష్‌బాబు బాలనటుని నుంచి సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగాడో మహాధన్ కూడా అలానే ఎదుగుతాడని, అతడిని వెండితెరపై చూస్తుంటే మరో హీరో పుట్టాడని అనిపించిందని ఆకాశానికెత్తేశాడు. ఇది ఆ పిల్లవాడికి ఉత్సాహం కాకుండా అత్యుత్సాహం చేసే విధంగా ఉందని చెప్పవచ్చు.