దీపావళి సంబరాలను మనం పెద్దగా జరుపుకోము గానీ ఉత్తరాది వారు, తమిళియన్స్‌కి ఈ పండుగ చాలా ముఖ్యమైంది. మనం అమావాస్య అనో మరేదో అని అనుకుంటాం..కానీ దీపావళి వేడుకలను ఎంత గ్రాండ్‌గా జరుపుకుని, భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ధనదాన్యాలు నిండుగా ఉంటాయని భావిస్తారు. ఇక దీపావళి అనేది కేవలం చిన్నపిల్లల పండుగ కాదు.. పెద్దవారు కూడా పటాస్‌లు పేల్చి బాగా ఆనందపడుతూ, చిన్ననాటి గుర్తులను జ్ఞప్తికి తెచ్చుకుని, నేడు పెద్దవారు కూడా పసిపిల్లలా మారిపోతారు.
ఇక విషయానికి వస్తే తెలుగులో 'దేశముదురు'తో హీరోయిన్‌గా పరిచయమైన స్టార్ హీరోయిన్ హన్సిక. బాలనటిగా ఉంటూ ప్రస్తుతం కూడా ఆమె తమిళంలో క్రేజీ హీరోయిన్‌గా కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఇక ఈమెకు వయసు చిన్నదే అయినా మనసు పెద్దది. ఏకంగా 150 నుంచి 200 మంది అనాధపిల్లలను దత్తత తీసుకున్న ఆమె చదువుతో పాటు వారి బాగోగులకు సైతం తానే స్వయంగా భరిస్తోంది. తనకు ఖాళీ దొరికితే చాలు తన కుటుంబంలోని వారికంటే వీరికే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఖాళీసమయం దొరికినప్పుడల్లా వారిని సినిమాలకు, పార్క్‌లకు తీసుకెళ్లడమే కాదు.. దూరప్రాంతాలలోని పర్యాటక స్థలాలకు కూడా పిల్లలందరినీ తీసుకుని వెళ్తుంది.ఇక ఈమె ఈ ఏడాది దీపావళిపండుగకు తనకు బ్రేక్ లభించిందని, పండుగ రోజుల్లో అందునా దీపావళి రోజు షూటింగ్‌కి బ్రేక్ లభించి, ఖాళీదొరికితే ఆ సంతోషమే వేరంటోంది.
దీంతో బ్రేక్ రావడంతో ఆమె తన స్వస్థలం ముంబైకి వెళ్లి అక్కడే దీపావళి జరుపుకుంటోంది. ఆమె తల్లితో పాటు ౧౦౦ మంది తమ బంధువులు దీపావళి సందర్భంగా తమ ఇంటికి వచ్చారని, తన తల్లి తన కోసం గాగ్రాచోళీ, లంగా ఓణి కొన్నట్లు తెలిపింది. ఈ రెండు రోజులు లక్ష్మీపూజలు చేసి, ఈరోజున తాను దత్తత తీసుకున్న పిల్లలను కలిసి స్వీట్లు, బాణాసంచా కొనిచ్చి వారితో దీపావళి జరుపుకుంటానని, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మరోసారి రాత్రికి దీపావళి జరుపుకుంటానని చిన్న పిల్లలా ఎంతో ఉత్సుకతతో చెప్పుకొచ్చింది. నిజంగా పండగనాడు తనకు లభించే తక్కువ ఖాళీ సమయంలో కూడా తాను దత్తత తీసుకున్న పిల్లల కోసం ఇంతలా తపన పడుతోన్న హన్సికకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే....!