సినిమా వారికి రాజకీయాలు చేయడం, నిజజీవితంలో నటించడం, తమని తాము ఎలా ప్రమోట్ చేసుకోవాలో.. రాజకీయాలలో ప్రజలందరి మనసులు గెలుచుకుని, పైస్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు మేనేజ్ చేయడం తెలియకపోవచ్చు గానీ రాజకీయాల నాయకులకు సినిమాలు తీయడం అంటే చిటికెలో పని. కేవలం వంద రెండోందలు ఉండే యూనిట్‌ని కోట్లాది మందికి మంత్రం వేసేవారు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. రాజకీయాలలోని ఎన్నో శాఖలను, ఎందరో మంత్రులను, ఎమ్మెల్యేలను కట్టిపడేసేవారికి సినిమా ఫీల్డ్‌లోని 24 శాఖలు గోటికి కూడా సరిపోవు. వారిలో మంచి రచయితలు కూడా ఉంటారు.
వీరిని ఆల్‌రౌండర్స్ అనే చెప్పాలి. ఇక తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన పేరును నిత్యం వార్తల్లో ఉండేలా చేసుకోవడం, తనను తాను రాష్ట్రాలకు సీఈవోగా ప్రమోట్ చేసుకోవడం, మీడియా మేనేజ్‌మెంట్ వంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా అధికార పార్టీల నాయకుల కంటే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. విపక్షాలనే కాదు.. తన పార్టీలోని వారికి కూడా తన కంటే ఎక్కువ పబ్లిసిటీ, మైలేజ్ రాకుండా చేయడంలో కూడా ఆయన దిట్ట. ఇక వర్మ 'లక్మీస్ ఎన్టీఆర్' విషయంలో కూడా చంద్రబాబు అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. అనవసరంగా ఈ చిత్రాన్ని హైలైట్ చేసి అనవసర ప్రాధాన్యం ఇచ్చి వారిని హీరోలను చేయకండని ఆయన తన పార్టీ నాయకులకు చెప్పుకొచ్చాడు.
'ఎన్టీఆర్ కారణజన్ముడు. ఆయన సినీ, రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి. అలాంటి మహానుభావుడి చిత్రాన్ని తీస్తున్నది ఎవరు? వారి వెనుక ఎవరు ఉన్నారు? అన్న విషయం ప్రజలకు తెలుసు. వారు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వారే స్పందిస్తారని తేల్చిపడేశాడు'. నిజమే.. టిడిపి నాయకులు ఏదో ఊహించుకుని, లేదా వర్మ చంద్రబాబుని విలన్‌గా చూపిస్తాడని ముందుగా తొందరపడి తమ నాయకుడి ముందు పేరు కోసం అనవసరంగా తొందరపడుతూ వర్మకి, ఆయన చిత్రానికి మైలేజ్ ఇస్తున్నారనే చెప్పాలి.