ఓ సినిమా ఎంత రక్తి కట్టాలన్నా దర్శకుని ప్రతిభతో పాటు రచయిత పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ఏ సీన్‌లో మౌనంగా ఉండాలి.. ఏ సీన్‌లో ఏ డైలాగ్ పెడితే పేలుతుంది అనేది రచయితల చేతిలో ఉంటుంది. దర్శకుడు లేదా హీరో ఆలోచనను చెబితే ఆ ఆలోచనకు అక్షరరూపం ఇచ్చేవాడు రచయిత. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలంటే కథ చెడకుండా, భావం తప్పుపోకుండానే ఆయా స్టార్స్ ఇమేజ్‌ని, ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకోవాల్సివుంటుంది. దానికోసం రచయిత అనేవాడు ప్రసవ వేదన అనుభవిస్తాడు. కొన్నిసార్లు అప్పటికప్పుడు అనుకొని పెట్టిన డైలాగ్స్ ఎవ్వరూ ఊహించని విధంగా పేలి ప్రేక్షకులను రంజింపజేస్తాయి.
ఇక 15ఏళ్ల కిందట వచ్చిన 'ఇంద్ర' చిత్రం ఎలాంటి చరిత్ర సృష్టించిందో అందరికీ తెలుసు. అశ్వనీదత్ నిర్మాతగా, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్‌ఫుల్ చిత్రానికి మాటలను పరుచూరి బ్రదర్స్ అందించారు. నాటి చిత్రంలోని డైలాగ్‌లను ఇప్పటికీ అభిమానులు చెప్పుకుని మురిసిపోతుంటారు. ఇక ఈచిత్రంలో చిరంజీవి మేనల్లుడిని కట్టేసి కొట్టే సీన్ ఉంది. ఆ సీన్‌లో వాడిని కొట్ట వద్దని, వాడిని పెంచిన తనని కొట్టమని చెప్పి చిరంజీవి దెబ్బలు తీనే సీన్ చిత్రానికే హైలైట్.
ఈ సన్నివేశం చిత్రీకరిస్తుండగా చిరంజీవి నుంచి పరుచూరి బ్రదర్స్‌కి ఫోన్ వచ్చిందట. ఈ సీన్‌లో నేను దెబ్బలుతింటుంటే అభిమానులు అల్లాడిపోతారు. ఇక్కడేదైనా డైలాగ్ పెడితే బాగుంటుందని చిరంజీవి చెప్పడంతో ఐదు నిమిషాలలో ఫోన్ చేస్తామని పరుచూరి బ్రదర్స్ చెబితే.. నో..నో. నేనే ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. కాస్త ట్రై చేయండి అన్నారట. 5 నిమిషాల తర్వాత చిరంజీవి ఫోన్‌చేస్తే 'తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నాను. లేకపోతే తలలు తీసుకుని వెళ్లేవాడిని' అనే డైలాగ్ పరుచూరి బ్రదర్స్ చెబితే చిరంజీవి సూపర్.. మీరు నా ఎదుట ఉండి ఉంటే కౌగిలించుకునే వాడిని...అని చిరంజీవి ఎంతో సంతోషపడిపోయారని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.