నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడైన తర్వాత ఒకటి రెండు చిత్రాలను మినహాయిస్తే ఆయన కూడా ఎక్కువగా దేవిశ్రీప్రసాద్‌కే చాన్స్ ఇచ్చేవాడు. సుకుమార్, కొరటాల శివలలాగా త్రివిక్రమ్ అంటే దేవిశ్రీనే సంగీతం అని ప్రేక్షకులు కూడా ఫిక్సయిపోయారు. మరి ఇది రొటీన్ అనిపించిందో, మరో కారణం వల్ల ఏమో తెలియదు గానీ ఆయన 'అ..ఆ' చిత్రానికి మొదట అనిరుధ్ ని తీసుకున్నాడు. కానీ నాడు తమిళ సినిమాలతో బిజీబిజీగాఉన్న అనిరుధ్ చివరి నిమిషంలో చేతులు ఎత్తేయడంతో ఆయన మరోకరితో సర్దుకుపోయారు. తనకు చివరి నిమిషంలో హ్యాండిచ్చిన అనిరుధ్‌ని ఇక త్రివిక్రమ్ పట్టించుకోరని ఆయన మనస్తత్వం తెలిసిన వారు భావించారు.
కానీ ఆయన చిత్రంగా తన తదుపరి చిత్రం పవన్‌కళ్యాణ్‌తో చేసే పెద్ద అవకాశాన్ని, ఓ రకంగా ఏ సంగీత దర్శకునికి లభించని బోనాంజా వంటి ఆఫర్‌ని ఆయన అనిరుధ్ కి ఇచ్చాడు. పవన్ చిత్రాలంటే మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా చూస్తారు. అందులోనూ పవన్‌కి ఇష్టమైన బిట్ సాంగ్స్, పెద్దగా స్టెప్స్ వేయని ఆయన మేనరిజమ్స్, ఒకే తరహా స్టెప్స్‌కి అనుగుణంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మరిపించడం సామాన్యమైన విషయం కాదు.
కానీ త్రివిక్రమ్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ గారు నా నుంచి మంచి అవుట్‌పుట్ రాబట్టుకోవడానికి ఆయన నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఆయన నాకు పెద్దన్నయ్య వంటి వారు. ఆయనను నేను గురూజీ అని సంబోధిస్తాను. తెలుగు సినిమాకి సంగీతం అందించాలనే కల ఆయన ద్వారా నెరవేరుతోంది. త్రివిక్రమ్ నా వద్దకు వచ్చినప్పుడు ఆయనకు నా మదిలో ఉన్న ట్యూన్స్ అన్నింటిని వినిపిస్తాను. ఆయన తనకు కావాల్సినవి వాటిల్లోంచి ఎంచుకుంటారు. ఇక కొత్త భాషకు సంగీతం అందించేటప్పుడు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని అనిరుధ్ చెప్పుకొచ్చాడు.