సినీ వారసులంటే కేవలం హీరోల కొడుకులు అనే అర్దం మారిపోయింది. నేడు దర్శకులు, నిర్మాతల కొడుకులు, సోదరులు కూడా వారసత్వాన్ని అందుకుంటున్నారు. కానీ కొందరు దర్శకులు ఎందరికో హిట్స్ ఇచ్చినా తమ కుమారులకు, సోదరులకు మాత్రం బ్రేక్ ఇవ్వలేరు. ఈవీవీ సత్యనారాయణ తన ఇద్దరుకొడుకులకు తాను బ్రేక్‌నివ్వలేకపోయానని బాధపడేవాడు. అల్లరినరేష్‌కి రవిబాబు హిట్టిచ్చినా.. ఈవీవీ ఎంతో కాలం ఈ హిట్‌ని ఇవ్వలేకపోయాడు. ఇక ఆర్యన్ రాజేష్‌కి హీరోగా బ్రేక్ ఇవ్వలేదు. ఇదేకోవలోకి దాసరి, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి వారు ఎందరో వస్తారు.
ఇక పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్‌ది కూడా అదే పరిస్థితి. ఆయన '143' చిత్రం ద్వారా తన తమ్ముడిని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఫర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆ బాధ్యతను తన పసలేని శిష్యుల చేతిలో పెట్టాడు. ఆ శిష్యులు గానీ చివరకు కృష్ణవంశీ కూడా సాయిరాంని ఆదుకోలేకపోయారు. ప్రస్తుతం పూరి తన కొడుకు ఆకాష్‌పూరీపై దృష్టి కేంద్రీకరించాడు. అయినా ప్రస్తుతం తెలుగులో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాల హవా బాగానే నడుస్తోంది. స్టార్స్ లేకపోయినా కంటెంట్ బలం ఉంటే విజయవంతం అవుతున్నాయి. ఈ సమయంలో '143, డేంజర్' వంటి చిత్రాలు వస్తే ఆడుతాయి.
కానీ సాయిరాంశంకర్ మాత్రం ఆ పని చేయకుండా ఒక రంగంలోనే రాణించలేకపోతే ఇప్పుడు మెగా ఫోన్ చేతబట్టి అదేసమయంలో ఆయనే అందులో హీరోగా నటించనున్నాడు. మరి దర్శకత్వం అంటేనే ఎంతో టెన్షన్‌తో కూడుకున్న పని అని సాయికి తెలుసు. కారణం ఆయన హీరో కాకముందు తన సోదరుడు పూరీ వద్దనే దర్శకత్వశాఖలో పనిచేశాడు. మరి పుష్కరకాలం దాటినా సక్సెస్‌కాలేకపోయిన ఆయనకు ఈ రెండు పడవల ప్రయాణం సరైనదేనా?