ఇంతకుముందు 'భరత్ అనే నేను' విడుదల సంక్రాంతి నుండి మార్చి నెలకి వెళ్లిపోయిందనే న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు - కొరటాల కలయికలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకుని అప్పుడే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మహేష్ బాబు 'స్పైడర్' విడుదలతో కొద్దిగా గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో అలా అలా ట్రిప్ కి వెళ్లొచ్చి మళ్ళీ ఇప్పుడు భరత్ అనే నేను షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. స్పైడర్ టాక్ తో కాస్త ఇబ్బంది పడ్డ మహేష్ ఇప్పుడు భరత్ అనే నేను సినిమా కోసం పూర్తిగా సిద్ధమయ్యాడట.
శ్రీమంతుడు వంటి భారీ హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన కొరటాల - మహేష్ కలయికలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా మొదలుపెట్టి సెట్స్ మీదకెళ్ళినప్పుడు భరత్ అనే నేను సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే అటు కొరటాల గాని ఈ సినిమా నిర్మాతలు గాని ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. ఇక ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు గాని మహేష్ భరత్ అనే నేను మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 20 న వేసవి సెలవల సందర్భంగా విడుదల చేసే ప్లాన్ లో భరత్ అనే నేను మేకర్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమర్షియల్ హంగులకు కామెడీ ట్రాక్ ని కలిపి ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.