పరుచూరి సోదరులకు పరుచూరి బ్రదర్స్ అని నామకరణ చేసి ప్రోత్సహించింది స్వర్గీయ ఎన్టీఆర్ అయితే, ఆయన తర్వాత వారు ఎక్కువగా తమ కెరీర్‌ను చిరంజీవితో కొనసాగించారు. ఇక పెద్దవాడైన పరుచూరి వెంకటేశ్వరరావుకి పరుచూరి రఘుబాబు అనే కుమారుడు ఉండేవాడు. అతడిని హీరోని చేయాలని భావించారు. కానీ ఆయన యుక్త వయసులోనే క్యాన్సర్ వచ్చి మరణించారు. ఆయన పేరిట ఇప్పటికీ పరుచూరి రఘుబాబు స్మారక అవార్డులను ఆ సోదరులు ఇస్తున్నారు.
ఇక పరుచూరి సోదరులిద్దరికీ సిగరెట్లు అలవాటు ఉండేది. 1986లో పరుచూరి గోపాలకృష్ణ ఆ అలవాటుని మానివేశాడు. కానీ అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం మానలేకపోయారు. 1989 వరకు ఆయన సిగరెట్లు తాగుతుండేవారు. ఓ సారి చిరంజీవి ఆయనను ఉద్దేశించి, కొడుకు అలా అయిపోయాడు. మీ కొడుకుకి గుర్తుగా ఈ అలవాటుని మానలేరా? అని పరుచూరి వెంకటేశ్వరరావుని ప్రశ్నించడంతో మేల్కోన్న ఆయన అప్పుడు సిగరెట్‌ని పక్కన పడేసి నాటి నుంచి ఆ అలవాటు మానేశాడు.
ఈ విషయం గురించి పరుచూరి గోపాలకృష్ణ చెబుతూ, అందుకే నేను 'మీకు సామ్రాజ్యాలు లేకపోయినా ఫర్వాలేదు. మంచి సలహా ఇచ్చే మిత్రుడు పక్కన ఉంటే దానికి మించినది మరోటి లేదు' అని చెబుతానని నాటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చిరంజీవిగారు మాకు ఎన్నో విషయాలలో సలహాను ఇచ్చిన మిత్రుడు. సన్నిహితుడు, మేము మెచ్చిన హీరో.. మా అన్నయ్య సిగరెట్ అనే భయంకరమైన అలవాటుని మానడానికి చిరంజీవే కారణం అనిచెప్పుకొచ్చాడు. నిజమే.. జీవితంలో మనం నమ్మినవారి మాటలు అన్నింటి కంటే మనపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. చెడగొట్టాలన్నామిత్రుడే.. బాగుపరచాలన్నా మిత్రుడే.