అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్రను అశ్వినీదత్ అల్లుడు, 'ఎవడే సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత, షాలిని పాండే లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే మహానటి షూటింగ్ మొదలుపెట్టి మూడు నెలలవుతుంది. ఈ లోపు కీర్తి సురేష్, సమంతల లుక్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఆ ఫొటోస్ లో కీర్తి సురేష్, సమంతలు అచ్చం అలనాటి నటీమణులల్లే ఉన్నారు. ఇకపోతే కీర్తి సురేష్ సరసన జెమినీ గణేశన్ పాత్ర చేస్తున్న దుల్కర్ సల్మన్ లుక్ దుల్కర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసింది చిత్ర బృందం.
ఇక ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ పుట్టినరోజు కానుకగా మహానటి చిత్ర బృందం కీర్తి సురేష్ 'మహానటి' లుక్ ని విడుదల చేసింది. ఇక ఆ లుక్ లో కీర్తి సురేష్ ని 'మహానటి' గా పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం కళ్లు మాత్రమే కనబడేలా ఆ లుక్ ని డిజైన్ చేశారు. ఇక ఆ కళ్లు మాత్రం అచ్చం సావిత్రి కళ్ళు లాగే కనబడుతున్నాయి. అయితే ఆ లుక్ తో పాటు 'ఆకాశ వీధిలో అందాల జాబిలి' అనే క్యాప్షన్ కూడా పెట్టి హ్యాపీ బర్త్ డే 'మహానటి' అంటూ వెరైటీగా 'మహానటి' లుక్ వదిలారు.
అశ్వినీదత్ కూతురు ప్రియాంకాదత్ వైజయంతి మూవీస్ పతాకంపై ఈ 'మహానటి' సినిమాని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.