నేడుదేశంలోని మేధావులందరు కులం రోజురోజుకి వ్యాపిస్తున్నతీరు చూసి భయపడుతున్నారు. కంచె ఐలయ్య వంటి వారు హిందుమతంలో ఉన్న తప్పొప్పులను తెలివిగా క్యాష్ చేసుకుంటూ 'సామాజిక స్మగ్లర్లు వైశ్యులు' అంటూ వీలైనంతగా కులం రంగు పులిమి, ఇతర మతాల వారి ఆశయాలను దొడ్డిదారిన నెరవేరుస్తూ తమ కుహనామేధావితనంతో ప్రజల మధ్య చిచ్చును పెడుతున్నారు. కుల పునాదులపై నిలబడుతున్న సమాజాన్ని ఎవరు వారికి అనుకూలమైన విధంగామార్చుకుని క్యాష్ చేసుకుంటున్నారు. నాటి పెద్దలే కులం కుళ్లుగా.. మతం మత్తురా అని చెప్పారు. కానీ కులగజ్జి మాత్రం రోజురోజుకి ఎక్కువవుతోంది.
కుల ప్రస్తావన లేని వారికి కూడా కులం అనే అంటువ్యాధిని అంటిస్తున్నారు. చిరంజీవి తప్పు చేశాడని విమర్శిస్తే నువ్వు కమ్మోడివి అంటారు. పవన్ మంచి పని చేశాడని ప్రశంసిస్తే నువ్వు కాపోడివి అంటున్నారు. బాలకృష్ణని తిట్టినవారంతా కాపులేనా? లేక చిరంజీవి, పవన్‌ల పద్దతులకు విమర్శిస్తే కమ్మోడై పోతాడా? ఇంకా లేదంటే తిట్టడానికి, కామెంట్ చేయడానికి ఏమీ లేకపోతే.. ప్రశంసిస్తే ఎంత తీసుకుని ప్రశంసిస్తున్నావు? అంటారు. విమర్శిస్తే 'ఏం నీకేం డబ్బులు ఇవ్వలేదా? విమర్శిస్తున్నావు? అంటారు. మతం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య.ఇక బిజెపి హిందుత్వాన్ని రెచ్చగొడితే మహా అయితే దేశం మూడు నాలుగు మతాల గొడవలు వస్తాయి. కానీ అదే కులం రంకు రాజేసే పెద్దల మాటలను ఆదర్శంగా తీసుకుంటే ఒక్క హిందు మతంలోనే కోట్లాది విభజనలు వస్తాయి.
ఇక విషయానికి వస్తే తాజాగా జగపతిబాబు కులంపై తన ఆవేదన వ్యక్తం చేశాడు. 'మనోడు' అంటున్నారని, అందరూ ఒకటే కదా అని ప్రశ్నించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, పదేళ్ల కిందట విజయవాడలోని సిద్దార్ద్ కాలేజీకి నన్ను ఆహ్వానించారు. ఆ రోజున నేను విద్యార్ధులను ఉద్దేశించి 'కులం మీద మాట్లాడాలని భావిస్తున్నాను' అని ప్రిన్సిపాల్‌కి చెప్పాను. ఆయన కంగారు పడి పోయి.. కులం గురించి మాట్లాడితే నరికి చంపేస్తారు సార్.. దయచేసి అది మాట్లాడవద్దు అని బతిమిలాడి చెప్పాడు. రెండు వేల మంది విద్యార్ధులు ఆడిటోరియంలో ఉన్నారు. నరికి నరికి చంపేస్తారని చెప్పారు. ముక్కలు ముక్కలు చేస్తారు.కాబట్టి కులం గురించి మాట్లాడవద్దని చెప్పారు నేను మాత్రం స్టేజీ ఎక్కగానే..మైక్ అందుకుని 'ఏందయ్యా మీ'కమ్మ'గోల? 'కమ్మ' అయితే ఏంటీ? గొప్పొళ్లా? ఆ కులంలో మనం పుట్టాం అంతే...ఆ కులం ఎవడో క్రియేట్‌చేస్తే మనం అందులో పుట్టాం...మీరు కులం పేరుతో కొట్టుకోవడం, మర్డర్లు చేసుకోవడం.. కులం ప్రాతిపదికన సీఎంను ఎంచుకోవడం ఏమిటి? మీఆలోచనలు, ఆలోచించే విధానం తప్పు. ఈ విషయాల గురించి నేను మాట్లాడితే నన్ను చంపేస్తారని మీ ప్రిన్సిపాల్ అన్నారు.నరికేయండి..నేను ఒక్కడినే ఉన్నాను. బాడీగార్డ్స్ ఎవ్వరూ లేరు.. నా పర్సనల్ వెపన్ కూడా తేలేదు.
నన్ను చంపేస్తే మీకు సంతోషం అంటే నేను రెడీ...అని చెప్పాను. దాంతో ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది. ఓ సెలబ్రిటీగా నేను చెప్పిన విషయాన్ని వారు అంగీకరించారు. ఇంకొకరైతే మర్డర్ చేసేవారేమో...అది వేరే సంగతి. మొత్తం మీద నాద్వారా వారికి ఓ మెసేజ్ వెళ్లినందుకు సంతోష పడ్డాను అని చెప్పుకొచ్చాడు. సెలబ్రిటీ, అందునా ఆడిటోరియంలో ఫంక్షన్ కాబట్టి వదిలేసి ఉంటారు. అదే విడిగా కులాల ప్రస్తావన, గొడవలు వస్తే నిజంగానే ఆ ప్రిన్సిపాల్ చెప్పినట్లు నరికేసి ఉండేవారు. అది మన దౌర్భాగ్యం.