ఏదైనా పొలిటికల్ యాంగిల్‌లో అందునా వారి తెర వెనుక భాగోతాలను చూపే చిత్రాలలో నటించాలంటే తర్వాత రాజకీయ వేధింపులు ఉంటాయని ఆ పాత్రల్లో నటించేందుకు ఎవ్వరూ అంగీకరించరు. అందునా తమిళనాట సినిమా వారికి, రాజకీయనాయకులకు ఉండే పగలు, ప్రేమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా కమల్‌హాసన్ వంటి స్టార్‌నే జయలలిత ముప్పు తిప్పలు పెట్టింది. ఇక తాజాగా విజయ్ నటించిన 'మెర్శిల్' చిత్రంలో జల్లికట్టు సీన్స్ ఉన్నాయని, వాటి చిత్రీకరణలో జంతువులను హింసించారని, ఆ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ ఎన్‌వోసీ ఇవ్వకపోవడంతో చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు సహకరించాల్సిందిగా విజయ్ ముఖ్యమంత్రి పళని స్వామిని కలిసి వేడుకోవాల్సి వచ్చింది.
ఇక విషయానికి వస్తే మొదట మహిళా ఐపియస్ కిరణ్‌బేడీ తర్వాత అంత సంచలనం సృష్టించిన వ్యక్తి డీఐజి రూప. ఈమె ప్రస్తుతం తమిళనాడుకు చెందిన కీలక నేత, జయలలిత నిచ్చెలి శశికళ కర్ణాటకలోని జైలులో అధికార దుర్వినియోగం, అవినీతితో జైలులోనే ఎలాంటి సుఖాలు అనుభవిస్తోంది? జైలు సిబ్బంది ఆమె మాయలో పడి జైలులో శశికళకు ఎలాంటి రాజబోగాలు అందిస్తున్నారు అనే విషయాలను బయటపెట్టి కర్ణాటక జైళ్ల శాఖ డిఐజిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో డిఐజి రూపా మీద ఓ చిత్రం తీయాలని తమిళ దర్శకుడు ఎ.ఎం.ఆర్.రమేష్ ఓచిత్రం తీయాలని నిర్ణయించుకన్నాడు.
ఈయన గతంలో రాజీవ్‌గాంధీ హత్యాఉదంతం మీద, బాబ్రీమసీదు కూలగొట్టిన అంశంమీద చిత్రాలు తీశాడు. దీంతో ఆయన డిఐజి రూపా మీద సినిమా తీస్తున్నాడనే అంశం పెద్ద సంచలనంగా మారింది. ఆయన రూపా పాత్రను చేయమని నయనతార, అనుష్కలని అడిగాడట. కానీ ఇలాంటి రాజకీయ పరమైన నిజజీవిత పాత్రలను తాము చేయమని నయన, అనుష్క నో చెప్పారని తెలుస్తోంది. దాంతో ఆయన ఈ పాత్ర కోసం త్రిషను ఆశ్రయిస్తున్నాడు. ఈ విషయంలో ఈ దర్శకుడు వర్మని ఆదర్శంగా తీసుకోవాలి. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రమే కాదు.. పరిటాల రవి, వంగవీటి వంటి పాత్రలకే కాదు.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లోని ఎన్టీఆర్ పాత్రకు కొత్తవారిని తీసుకుని ఆయనే శిక్షణ ఇస్తున్నాడు.