కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న 'రాజా ది గ్రేట్' చిత్రంలో రవితేజ తెలుగులో ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని విధంగా ఫుల్‌లెంగ్త్‌లో అంధునిగా చేశాడు. గతంలో ఎన్టీఆర్, చంద్రమోహన్ వంటి వారు దివ్యాంగులుగా నటించారు. అయితే ఇప్పటి జనరేషన్‌కి మాత్రం ఇది కొత్తేననిచెప్పాలి. అందునా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రం వస్తుండటం విశేషం. గుడ్డివానిగా నటిస్తున్నప్పటికీ ఈచిత్రంలో వైవిధ్యంతో పాటు హాస్యం, మనసుని తాకే భావోద్వేగాలు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని చెబుతున్నాడు రవితేజ. ఇక ఆయన దర్శకుడు అనిల్‌రావిపూడి, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఈ చిత్రం షూటింగ్ సమయంలో 'చిన్నజీయర్ దివ్యాంగుల స్కూల్'కి వెళ్లారట.
అప్పటిదాక దివ్యాంగులంటే ఎంతో విషాదంగా, నిస్తేజంగా ఉంటారని భావించిన తాము షాక్ అయ్యామని, ఆ స్కూల్‌లోని విద్యార్ధులు స్టేజీపై కొలతలు వేసుకుని ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా డ్యాన్స్ చేసిన విధానం చూసి ఆశ్యర్యపోయామని, దివ్యాంగులకు కళ్లు లేకపోయినా వారికి ఏకాగ్రత, పట్టుదల, ఆత్మవిశ్వాసం, మిగిలిన అవయవాలు అందరికంటే ఎంతో ఎక్కువగా పనిచేస్తాయని మాకు తెలిసొచ్చిందని రవితేజ అంటున్నాడు. ఇక నుంచి రొటీన్‌చిత్రాలు చేయనని, ప్రేక్షకులు కొత్తదనం ఉంటేనే వస్తున్నారని, ఇకపై మంచి వైవిధ్యభరితమైన చిత్రాలే చేస్తానని చెప్పాడు.
తాను ఈ చిత్రం తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' చిత్రం చేస్తున్నానని, తాను ఏ చిత్రమైన అనౌన్స్ చేసిన తర్వాతే చెబుతానని అంటున్నాడు. అయితే మీడియాలో మాత్రం రవితేజ తదుపరి తమిళ 'భోగన్' రీమేక్‌తో పాటు బండ్ల గణేష్ నిర్మాతగా రెండేళ్ల గ్యాప్ తర్వాత నిర్మించనున్న చిత్రంలో నటిస్తాడని తెలుస్తోంది. ఇక 'భోగన్' రీమేక్, బండ్ల గణేష్‌ల చిత్రాలకు దర్శకులు ఖరారైనప్పటికీ వారి పేర్లు ఇంకా సస్పెన్స్‌లోనే ఉన్నాయి.