కులవ్యవస్థ నాటి రోజుల్లో ఉండేది. కేవలం అక్షరాస్యత లేని వారిలోనే ఇది ఉంటుందని, కాబట్టి ఎక్కువగా నిరక్ష్యరాస్యులు ఉండే పల్లెటూర్లలో ఇది బాగా వ్యాపితంగా ఉండేదని భావించేవారం. నాటి కాలంలోని పెద్దలు కూడా అదే ఆలోచించారు. అగ్రవర్ణ బ్రాహ్మణులు అయినప్పటికీ నాటి మహాకవులైన 'శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి' నుంచి నిన్నటి వేటూరి సుందరామ్మూర్తి వరకు కులాన్ని వెలివేశారు. 'ఏకులము నీదంటే గోకులము నవ్వింది..' అనే గీతాలను రచించి, అన్ని కులాలు, నిమ్నజాతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కుల రహిత సమాజం కోసం కలలు కన్నారు. తాము బతికున్నప్పుడు సమసమాజం రాకపోయినా, విద్య అందరిలో పెరుగుతోంది కాబట్టి అందరిలో చైతన్యం వస్తుందని, తమ తర్వాతితరాలైనా కుల రహిత సమాజంలో ఉంటారని ఆశించారు. కానీ కుల భావనకు చదువుకి పొంతన తెలిసిపోతోంది.
ఎక్కడెక్కడో విదేశాలలో పెద్ద పెద్ద సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవారు కూడా కులం మీద పడి తమవారినే ఆకాశానికి ఎత్తుతున్నారు. సోషల్ మీడియాలో కులం పేర్ల మీద గ్రూప్‌లు నడుస్తున్నాయి. ఒకప్పుడు కాపు నాయుడుకి, కమ్మనాయుడికి తేడా తెలియనివారికి కూడా వీరు తమ పోస్టింగ్‌ల ద్వారా తేడాను చెప్పేస్తున్నారు. తమ పిల్లలను కూడా అలాగే పెంచుతున్నారు. కులం మాకొద్దు బాబోయ్ అంటోన్న పవన్‌కళ్యాణ్, ప్రభాస్‌లను కూడా కులం ఉచ్చులోకి లాగుతున్నారు. ముందుగా ఏ నటుడైనా, టెక్నీషియన్ అయినా కులం ఏంటో తెలుసుకుని దానిని బట్టి ఆరాధిస్తున్నారు.
'బాహుబలి' బ్లాక్‌బస్టర్ కావడంతో మా కులం వాడైన రాజమౌళి పుణ్యమేనని కొందరు, కాదు మా ప్రభాస్ వల్లనే ఆని ఆయన కులం వారు తిట్టుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇక స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హీరో నాని నివాళులు అర్పిస్తే నానిని ఎవరో నెటిజన్ కులం పేరు మీద దూషించాడు. దాంతో మండిపడిన నాని ఇలాంటి అబిమానులు నాకులేకపోయినా ఫర్వాలేదు. నేను ఎన్టీఆర్‌నే కాదు. ఏయన్నార్, చిరంజీవికి కూడా ఫ్యాన్‌నని తెలిపాడు.
ఇక తాజాగా కులం గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. మొదట్లో నాకు చాలా కాలం వరకు కులం అంటే ఏదో తెలియదు. కొందరు ఇతను 'మనవాడే, మనోడే' అంటే అర్ధమయ్యేది కాదు. కానీ తర్వాత 'మనోడు, మనవాడు' అంటే అర్ధమైంది. అయినా అందరూ మనోళ్లే కదా అని భావించేవాడిని. చీ ఈ మనోడి ఏంటి అందరూ సమానమే కదా అనే ఫీలింగ్ నాకు చిన్ననాటి నుంచి ఉండేది. 'పండుగాడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌బ్లాక్ అవ్వాలి' లాగా ఈ కులం గొడవ ఎవడో పండుగాడు పెడితే, దానివల్ల ఎందరో మైండ్‌లు బ్లాక్ అవుతున్నాయి. ఆ బ్లాక్ నుంచి బయటికి రావాలి. ఎవడో ఏదో కులంలో పుట్టాడు. ఆ కులంలో మనం పుట్టాం. ఆ కులం నాది అనుకోవడం మొదలైంది. నాది అని ఎప్పుడైతే ఫీలయ్యామో.. ఇగో సమస్యలు వచ్చేశాయి. 'ఐ నీడ్ మై సెల్ఫ్' అనే భావన వచ్చేసి కొట్టుకు చస్తున్నామని జగపతిబాబు ఆవేదనగా చెప్పుకొచ్చాడు. మార్పు అనేది నేడు మొదలైనా ఆ మార్పు అనేది రానంతకాలం మనం కలిసికట్టుగా ఉండలేం. కులం కుళ్లు ఉంటే అభివృద్ది చెందిన భారతావనిని ఎన్ని తరాలైనా చూడలేం...!