దర్శకత్వ శాఖలో పనిచేస్తూ చిన్నచిన్న వేషాలు వేస్తూ.. మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ.ఆయన కెరీర్‌లో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. డ్రగ్స్ కేసు నుంచి పలు వివాదాలలో కూడా చిక్కుకున్నాడు. సిక్స్ ప్యాక్ పుణ్యమో.. లేక బయట పుకార్లు వస్తున్నట్లు ఏదో అనారోగ్యంతోనే పీలగా తయారయ్యాడు. ఆ సమయంలో ఆయన గ్లో పోయింది. ఆయన నటించిన చిత్రాలు కూడా సరిగా ఆడలేదు. ఎప్పుడు తాను చేసే రొటీన్ కమర్షియల్ చిత్రాల ద్వారా, తనదైన ఎనర్జిటిక్ నటన, కామెడీ పంచ్‌లతో, సెటైర్లతో సినిమాలు చేశాడు. కానీ ఫలితం శూన్యం. ప్రేక్షకులు ఎంత మంచి కమర్షియల్ చిత్రమైనా సరే ఏదో ఒక వైవిధ్యం లేనిదే ఆదరించడం లేదనే విషయాన్ని గ్రహించకుండా ఏవేవో చిత్రాలు చేశాడు.
ఇక 'బెంగాల్‌టైగర్' తర్వాత దాదాపు రెండేళ్లుగా ఆయన వెండితెరపై కనిపించలేదు. ఈ కాలంలో ఆయన విదేశాలు చుట్టి వచ్చాడు. వివిధ ప్రదేశాలు తిరగడం, అక్కడి ప్రదేశాలన్నింటిని తిరగేసి చూడటం, అక్కడి ఆహార రుచులు, పద్దతులు, సంప్రదాయాలు, సంస్కృతులు చూడటం తనకిష్టమని, ముఖ్యంగా యూరప్, యూఎస్‌ఏలు ఎంతో ఇష్టమని చెబుతున్నాడు. ఇక ఈ గ్యాప్ తాను తీసుకోలేదని దానంతట అది వచ్చిందని తెలిపాడు. ఇక ఇంత గ్యాప్ తర్వాత తాను ఓ మంచి చిత్రమైన 'రాజా ది గ్రేట్' ద్వారా రావడం ఆనందంగా ఉందని, తాను ఈచిత్రం విషయంలోనే కాదు.. ఏ విషయంలోనూ టెన్షన్ పడను అని చెబుతున్నాడు.
తన కొడుకు కూడా ఇందులో చిన్నప్పటి రవితేజలా నటించాడని, తాను వద్దన్నా దర్శకుడు అనిల్‌రావిపూడినే బాగుంటుంది.. నటింపజేద్దామని పట్టుబట్టాడని, వాడు నటించిన సీన్స్ బాగా వచ్చాయని అంటున్నారని, అయితే తాను ఇంకా చూడలేదని, వాడికి కూడా సినిమాలంటే పిచ్చి అని, ఎంతైనా నటుడి కొడుకు కదా..! సినిమాలు చూస్తూ పెరుగుతున్నాడు కాబట్టి అది సహజమేనని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో వాడేం అవుతాడో చూద్దాం.. నాది క్యూట్ ఫ్యామిలీ.. ఇద్దరు పిల్లలు. ఓ పాప ఓ బాబు.. వారు నా పిల్లలే కాదు..మంచి ఫ్రెండ్స్ కూడా. నేటితరం కంటే మా పిల్లలు బాగా ఫాస్ట్‌గా ఉంటారు. వారికి ఏది మంచిదో అదే చెబుతాను తప్ప ఏదీ వారిపై బలవంతంగా రుద్దను.. అని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి తాను చేసే చిత్రాలు కూడా ఏదో విధంగా వైవిధ్యంగా ఉంటే గానీ ఒప్పుకోనని చెప్పుకొచ్చాడు.