ఎంత ముఖ్యమంత్రులు, మంత్రులు బాగా పనిచేస్తున్నా కూడా కిందిస్థాయి అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రభుత్వాలు నిర్దేశించుకున్న ఫలాలు దక్కవు. కలెక్టర్లు, అధికారులు ఏ మాత్రం పనిచేయకపోతే మహా అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అంతకుమించి ఏమీ చేయలేరు. ఇక అవినీతి చేస్తే మహాఅయితే సస్పెండ్ చేస్తారు. అంతేకదా....! అనే నిర్లక్ష్యధోరణి అధికారుల్లో ఎక్కువైపోతోంది. ఇక ప్రజాప్రతినిధులను అది కూడా చేయలేరు. ఎన్నుకున్నందుకు ఐదేళ్లు అనుభవించాల్సిందే. మహా అయితే తర్వాత ఎలక్షన్లలలో టిక్కెట్ ఇవ్వరు.. ఇచ్చినా ఓడిపోతారు. అంతకు తప్ప ఈ ఐదేళ్లు మాత్రం వారిని కదల్చలేరు. అందుకే ప్రజలకు రీకాల్ వ్యవస్థ ఉండాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఇక విషయానికి వస్తే తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్... వరంగల్ అధికారులైన కలెక్టర్ అమ్రపాలి, మున్సిపల్ కమీషనర్, మేయర్, ప్రజా ప్రతినిధులను నిలదీశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ప్రజలకు బడ్జెట్‌లో 300కోట్లు కేటాయించారని, వాటి ప్రతిపాదనలేవీ అని నిలదీశారు. ఇంత దారుణంగా పనిచేస్తుంటే ఎలా? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేకుంటే ఇక మిగిలిన వారి సంగతేమిటి? నిధులు ఇస్తాం... లక్ష్యాలు ఇస్తాం.. ఇంతకంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి వచ్చి అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టాలా? అని నిలదీశాడు.
అధికారులైతే ట్రాన్స్‌పర్ చేస్తాం.. మరి ప్రజా ప్రతినిధులు ఏమని సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఒకదశలో కలెక్టర్ అమ్రపాలి ఏదో సమాధానం ఇవ్వబోతుండగా, కేటీఆర్ ఆగ్రహంతో 'డోంట్ ఆర్గ్యూ అమ్రపాలి' అని అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ అభివృద్దికి ప్రభుత్వం చేస్తోంది ఒకటైతే ఇక్కడ జరుగుతోంది మరోకటి అని ఎండగట్టారు. ఎమ్మెల్యే వినయ్ వ్యవహారశైలిని ఎండగట్టిన ఆయన స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాల అమలులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఈ సమయంలో రివ్యూ సాగించలేనని తేల్చిచెప్పి అధికారులు, ప్రజా ప్రతినిధులు 24వ తేదీ హైదరాబాద్ రావాలని ఆదేశించారు.