మహేష్ బాబు నిర్మాతల పాలిట ఒక వరం. ఎందుకంటే తన సినిమా విషయంలో ఏమన్నా తేడా వస్తే సినిమా నిర్మాతలకు అండగా ఉంటాడనే టాక్ వుంది. ఇంతకుముందు 'బ్రహ్మోత్సవం' సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి కష్టాల్లో ఉన్నప్పుడు తన పారితోషికంలో కొంత నిర్మాతకు ఇచ్చి ఆదుకున్నాడు. అప్పట్లో మహేష్ నష్టాల్లో ఉన్న నిర్మాతను ఆదుకున్నాడంటూ గొప్పగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మహేష్ తన నిర్మాతను ఆదుకున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి.
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన 'స్పైడర్' చిత్రం నెగిటివ్ టాక్ తో అనుకున్నంత విజయం సాధించక పోవడంతో, మహేష్ మళ్లీ తన వంతుగా నిర్మాతని ఆదుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'స్పైడర్' నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కి తాను తీసుకున్న పారితోషికంలో నాలుగోవంతు తిరిగి ఇచ్చేస్తానని మహేష్ మాట ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన 'స్పైడర్' కోసం మహేష్ బాబు దాదాపుగా 23 కోట్ల పారితోషికం తీసుకున్నాడని న్యూస్ ఉంది. మరి సినిమాకోసం ఏడాదిన్నర కష్టపడినప్పటికీ.... సినిమా తనదిగా భావించి.. మహేష్ పెద్దమనసుతో 'స్పైడర్' నిర్మాత కోసం ఇలా ముందుకు రావడం గ్రేటే.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విషయంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా టాక్.