జీఎస్టీ వల్ల సినిమా థియేటర్ల టిక్కెట్ల రేట్లలో భారీ భారం పడుతున్న రాష్ట్రంగా తమిళనాడుని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తమిళంలోనే టైటిల్, యు సరిప్టిఫికేట్ ఉన్న చిత్రాలకు అసలు వినోదపు పన్నే తమిళనాడులో ఉండేది కాదు. కానీ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 28శాతంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించిన10శాతం వినోదపు పన్నుతో అక్కడి థియేటర్ల రేట్లకు రెక్కలొచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం విధించిన 10శాతం వినోదపు పన్నుని తీసివేయాలని తమిళ నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. రెండు వారాలుగా సినిమాల విడుదలను ఆపివేశారు. కానీ దీపావళికి విజయ్ 'మెర్శల్' రిలీజ్ కానుండటం, ఇంకా ఎంతో కాలం సినిమాల విడుదలను ఆపే అవకాశం లేకపోవడంతో సినీ ప్రముఖులు రాజీపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 శాతం మినహాయింపునిచ్చి8శాతం పన్నుని ఖరారు చేసింది. ఇక ఎంత పెద్ద హీరో సినిమా అయినా అసలు రేట్లకే అమ్మాలని , ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తమిళనాడు సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి రాజా హెచ్చరించారు. ఇక నటీనటుల పారితోషికాలను నడిగర్ సంఘం, నిర్మాతల మండలి చూసుకుంటాయని చెప్పాడు. విశాల్ డిమాండ్ చేసినట్లుగా థియేటర్లలో తినుబండారాలను బయట దొరికే ఎంఆర్‌పీ రేట్లకే అమ్మాలని, పార్కింగ్ ఫీజును రద్దు చేయాలని, అమ్మ నీటిని అమ్మాలనే విషయాలను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. మరోవైపు సినీ థియేటర్ల సంఘం అద్యక్షుడు రామనాధన్ మాట్లాడుతూ, పెద్ద హీరోల చిత్రాలైనా అసలు టికెట్ ధరలకే విక్రయిస్తామని, తినుబండారాలను ఎంఆర్‌పీ ధరలకే విక్రయిస్తామని, బయటి తినుబండారాలను, పానీయాలను థియేటర్లలోకి అనుమతించే విషయాన్ని థియేటర్ల యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
ఇక పార్కింగ్ ఫీజు విషయం కోర్టులో ఉన్నందువల్ల దానిపై మాట్లాడనని, అయినా తమపై షరతులు, నిబంధనలు పెట్టడానికి విశాల్ ఎవరని, సినిమా థియేటర్ల యజమానులమైన మాకు కూడా ఓ యూనియన్ ఉన్నవిషయాన్ని ఆయన గ్రహించాలని, తమతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు ప్రకటించాలని పేర్కొన్నాడు. మొత్తానికి ఎంత పెద్ద హీరో చిత్రమైన అసలు ధరకే అమ్మడం, తినుబండారాలను ఎంఆర్‌పీ ధరలకే విక్రయించడం, తినుబండారాలు, మంచి నీటిని బయటి నుంచి అనుమతించడం, పార్కింగ్ ఫీజును రద్దు చేయడం వంటివి మన రెండు తెలుగు రాష్ట్రాలలోకూడా అమలు చేస్తే బాగుంటుంది.