ఈ మధ్య జగన్ వైఖరి చూస్తే నవ్వొస్తోంది. ఆయన వైసీపీ పెట్టినప్పుడంత తెగువ తనపై కేసులు వచ్చిన తర్వాత చూపించలేకపోతున్నాడు. ప్రత్యేకహోదాని టిడిపి తాకట్టు పెట్టిందని అంటూనే బిజెపి నాయకులతో చెలిమికి తహతహలాడిపోతున్నాడు. తాను అక్రమాస్తుల కేసు నుంచి బయటపడాలంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పాదాభివందనం చేయడం కన్నా గత్యంతరం లేదని ఆయన చేసే పనులను చూస్తే తెలుస్తోంది. ఒకవైపు ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబును తప్పుపడుతున్నాడు.
కేంద్రం వద్ద టిడిపి ప్రత్యేకహోదాకు డిమాండ్ చేయకపోవడం తప్పే. కానీ కేంద్రంతో తగువులాడి ఉపయోగం లేదనే చెబుతున్న చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. మరి జగన్ ఎందుకు ప్రత్యేకహోదాపై బిజెపిని విమర్శించడం లేదు. ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్‌కి మద్దతిస్తామనే కండీషన్ ఎందుకుపెట్టలేదు. ప్రత్యేకహోదా కోసం తన ఎంపీలు రాజీనామా చేసి విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకుని వస్తామని చెప్పి, మరలా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు.
ఇంకా బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిగానే ఉన్న కోవింద్ రాష్ట్రపతి కాకముందే ఆయన కాళ్లపై పడాల్సిన అవసరం ఏమిటి? అనేవి ప్రజలకు తెలియని అంశాలు, అర్ధం చేసుకోలేని అంశాలేమీ కాదు. ఇక ప్రత్యేకహోదాకి మద్దతు ఇస్తున్న మేధావివర్గాలు, జనసేన అధినేత పవన్, వామపక్షలు వంటివి ఒకే గూడు కిందకు రావాలని వైసీపీ నేతలు ఉచిత సలహాలు ఇవ్వడం సిగ్గుచేటు. ఎలాగైన జనసేనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ నానాతిప్పలు పడుతూ, తన సొంత వ్యక్తిత్వాన్ని, నిలకడలేమిని, తొందరపాటుతనాన్ని చూపి నవ్వుల పాలవుతూ, తన అస్థిత్వానికే ముప్పు తెచ్చుకుంటున్నాడని చెప్పాలి.