వైసీపీనేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంకా తన పాదయాత్ర మొదలుపెట్టనే లేదు అప్పుడే తెలుగుదేశం నాయకులు ఆయనపై విమర్శలు, చురకలు, సెటైర్లు వేసి ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం, ఆయన నాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోసింది కేవలం కేంద్రంలోని కాంగ్రెస్ రాష్ట్రాలను శాసించి, ఢిల్లీపీఠం ద్వారా ప్రభుత్వాలను నడపాలని చూడటం, వంశపారంపర్య రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. అదే నాడు ఆయన గెలుపుకి ప్రజలు పట్టం కట్టడానికి ఓ ముఖ్యకారణంగా చెప్పాలి. ఇక ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో రెండో పెళ్లి చేసుకోకముందే సినిమాలలోనూ, రాజకీయాలలోనూ నా వారసుడు బాలకృష్ణనే అని చెప్పాడు.
కాంగ్రెస్‌ని అదే విషయంలో విమర్శించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ మరలా తానే తన వారసుడిని ప్రకటించడం అనేది ద్వందనీతి. ఇక లక్ష్మీపార్వతికి, చంద్రబాబుకు పొసగని విషయం కూడా ఎన్టీఆర్ తర్వాత ఆయన భార్యగా టిడిపి పగ్గాలు తనకే దక్కాలని లక్ష్మీపార్వతి పట్టుబట్టడమే. ఇక అల్లుడు ముఖ్యమంత్రి కావడం, ఇప్పుడు బాలకృష్ణ కూడా ఎమ్మెల్యే అవ్వడం, రాబోయే రోజుల్లో చంద్రబాబునాయుడు తనయుడు, ఎన్టీఆర్ మనవడు, మంత్రి నారాలోకేష్‌ని ముఖ్యమంత్రిగా ఫోకస్ చేయడం కూడా తెలిసిందే. ఇక విషయానికి వస్తే మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి జగన్ పాదయాత్రపై స్పందిస్తూ 'జగన్ పాదయాత్ర కాదు కదా.. తల్లకిందులుగా నడిచినా ప్రజలు ఆయనకు ఓటేయరు. ఆయనకు పదవీ కాంక్ష ఎక్కువ. ముఖ్యమంత్రి కావాలనే యావ మరీ అధికం.
తాను ముఖ్యమంత్రిని అవుతానని, 30ఏళ్ల పాటు అదే సీటులో కూర్చుంటానని ఆయనే చెప్పి తన మనసులో ఏముందో చెప్పాడు. దానిని ప్రజలు గమనిస్తున్నారు. రాజు కొడుకు రాజు కావచ్చేమో గానీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాలేడని వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు'. ఇలాంటి చవకబారు కామెంట్స్ వల్లనే చాలా మంది టిడిపికి దూరమవుతున్నారు. మరి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాలేడని తెలిసి, ఎన్నికల ద్వారా ప్రజల చేత ఓట్లేసి గెలిపించుకునే ధైర్యం లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి, రాబోయే రోజుల్లో లోకేషే ముఖ్యమంత్రి అని చెప్పడం సమంజసమా? నిజమే.. జగన్‌కి ఆ యావ ఎక్కువని అర్ధమవుతోంది. అయినా తాము అదే తప్పు చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడి నలుగురిలో నవ్వుల పాలు కావడం టిడిపి నాయకులు అత్యుత్సాహమేనని చెప్పవచ్చు.