'బాహుబలి' వంటి మాస్టర్‌పీస్ తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రం కోసం తెలుగు పరిశ్రమ.. తెలుగు ప్రేక్షకులే కాదు... దేశవ్యాప్తంగా అన్ని భాషల వారు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేస్తాడని, తమిళ స్టార్ ధనుష్ హీరోగా ఓ ప్రయోగాత్మక బహుభాషా చిత్రాన్ని తీస్తాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఆయన ఇప్పుడే తీయనని చెప్పినా పదే పదే 'మహాభారతం' గురించి మాట్లాడుతున్నారు. ఇక రాజమౌళి ఇప్పటికే డీవీవీ దానయ్యకు, దుర్గాఆర్ట్స్ బేనర్‌కి చెందిన కె.ఎల్.నారాయణలకు ఎప్పుడో కమిట్ అయి ఉన్నాడు. సో.. ఆయన తాజాగా మాట్లాడుతూ, తాను చేసే తదుపరి చిత్రానికి దానయ్యను నిర్మాతగా తేల్చేశాడు.
అయితే ఇది బహుభాషా చిత్రమా? హీరో ఎవరు అనేది ఇంకా తేల్చలేదనిచెప్పాడు. అయితే ఇందులో నటించేది స్టార్‌హీరోనే అని తేల్చాడు. ఇక దానయ్యతో రాజమౌళి చేసే చిత్రంలో ప్రముఖంగా మరలా ప్రభాస్ పేరు, అల్లుఅర్జున్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి 'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్' వంటి ఐదేళ్ల ప్రాజెక్ట్‌ల తర్వాత వెంటనే ప్రభాస్‌ని రిపీట్ చేయకపోవచ్చు. అందునా ప్రభాస్ కూడా 'సాహో' తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణల దర్శకత్వంలో బిజీగా ఉండనున్నాడు. ఇక దానయ్య వద్ద బన్నీడేట్స్ ఉన్నాయి. అల్లుఅరవింద్ ఎప్పటినుంచో రాజమౌళి చిత్రంలో తన కుమారుడు నటించేలా చేయాలని మంతనాలు చేస్తున్నాడు. బన్నీ కూడా తనకు 'మగధీర' వంటి హిట్‌ని ఇచ్చేలా చూడమని తన తండ్రిపై ఒత్తిడి తెస్తున్నారట.
అదే నిజమైతే 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' తర్వాత బన్నీ ఎలాగూ తమిళ్ మార్కెట్‌కోసం ఎదురుచూస్తున్నాడు కాబట్టి బన్నీతో రాజమౌళి చేస్తే తెలుగు, మలయాళం, తమిళం, హిందీలలో కూడా క్రేజ్ వస్తుంది. సో..ఈ ఛాన్స్‌ని మాస్టర్‌మైండ్ అల్లుఅరవింద్ వదలడని అంటున్నారు. ఇక కె.ఎల్.నారయణకు రాజమౌళిచేసే చిత్రం మాత్రం మహేష్‌తోనే అని జక్కన్న కన్‌ఫర్మ్ చేశాడు. ఈ చిత్రం 2019లో ఉంటుంది. ఈ రెండు చిత్రాలు సాంఘిక చిత్రాలు చేస్తున్నాడు. 'బాహుబలి' సమయంలోనే జక్కన్న ఎలాంటి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు ఉండే చిత్రం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.