తెలుగులో రచయితగా, కవిగా, నటునిగా, దర్శకునిగా, శివభక్తునిగా తనికెళ్లభరణికి ఎంతో పేరుంది. ఆయన శివుడిపై ఎన్నో పాటలు రాసి వాటి ఆల్బమ్‌ల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అందులోని కొన్ని పాటలను ఆయనే స్వయంగా ఆలపించాడు కూడా. ఇక ఆయనలో దైవచింతన ఎంత మెండో తెలుగు భాషపై మమకారం కూడా ఎంతో ఎక్కువ. తాజాగా ఆయన మాట్లాడుతూ, పుస్తకం మంచి స్నేహితుడు అంటారు. తిండిలేకపోయినా నేను బతకగలను గానీ పుస్తకం లేకుండా బతకలేను. ఓ పది పుస్తకాలు పడేసి చదువుతూ ఉండమంటే నాకు అదే చాలు. ఇక నేటియువత కనీసం ఈ అలవాటును చేసుకోండి.
తెలుగు సాహిత్యాన్ని చదవండి. నాడు ప్రతి ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం వంటివి చదివేవారు. వినేవారు. కానీ నేడు అలా ఎవ్వరు లేరు. టైంపాస్ కోసం, భక్తి భావం కోసం, ముక్తి కోసం, దైవచింతన కోసం కావ్యాలు చదివేవారు. నాడు 10 నుంచి 100 పద్యాలు రాని ఇళ్లే ఉండేది కాదు.. పోతన భాగవతం, ద్రాక్షపాకం వంటివి ఎంత చదివినా తనివి తీరదు. పోతన పద్యాలు పది రాకపోతే తెలుగువారిమని చెప్పడం మానేయండి...కనీసం ఆ పుస్తకాలను పట్టుకున్నా పుణ్యం వస్తుంది. అదైనా చేయండి.... పోతన భాగవతం ఆధ్యాత్మికం, రసాత్మకం, ముక్తి , రక్తి రెండింటిని కలిగిస్తుంది. పోతన భాగవతం చదివితే దైవ సాక్షాత్కారం లభిస్తుందని చెప్పుకొచ్చాడు. కానీ నేటి రోజుల్లో అందరూ 'గూగుల్ తల్లి'ని నమ్ముకుంటున్న నేటిరోజుల్లో పురాణ సాహిత్యాలు చదివే సమయం, ఉద్దేశ్యం ఎవ్వరికీ లేవు.
పెద్దలు మారిపోయి ఇంగ్లీషు మీడియాల మీదపడ్డారు. ఇక ప్రభుత్వాలు అదే బాటలో నడుస్తున్నాయి. తెలుగు భాషా సంఘాలు ఏమి చేస్తున్నాయో అర్ధం కాదు. నేటి రోజుల్లో తెలుగు నేర్చుకునే వారిని దున్నపోతులుగా చూస్తున్నారు. ఇంగ్లీషులో మాట్లాడితేనే గౌరవం. కాబట్టి 'పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. కానీ నీ మాతృభాషలోనే నువ్వు సంభాషించు' అనే విషయాన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదంతా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే.. కంఠశోష తప్ప మరోది లేదు.ఇంకా చెప్పిన వారికి చాదస్తం అని కొట్టిపడేస్తారు.