సమంత అక్కినేని ఇంటికోడలై వారం దాటింది. అధికారికంగా ఆమె తన పేరును అక్కినేని సమంతగా మార్చుకుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ గౌరవం కాపాడటం తన వంతు అని, తాను శాయాశక్తులా అక్కినేని గౌరవాన్ని కాపాడుతానని అర్దం వచ్చేలా చెప్పింది. ఇక అక్కినేని ఫ్యామిలీలో మగవారితో సమానంగా ఆడవారికి కూడా స్వేచ్చ ఉందని ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఆమె అక్కినేని కోడలిగా మారిన తర్వాత విడుదలవుతున్న చిత్రంగా 'రాజుగారిగది 2'కి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో తన మామయ్య నాగార్జున కూడా నటించడం విశేషం. ఇక ఆమె తెలుగులో గలగలా మాట్లాడింది. తనపై ఇంత అభిమానం చూపుతోన్న మీడియాకు ధన్యవాదాలు చెబుతూ,సినిమా గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడుతున్న యూనిట్‌ని చూస్తే భయమేస్తోందని తెలిపింది.
ఈ సినిమాలో పనిచేసిన అనుభవం బాగా ఉందని, ఈ సినిమాలోని పాత్ర అందరికీ నచ్చుతుందని, నాగార్జునగారు, ఓంకార్ గారు మంచి సినిమా తీశారని కితాబునిచ్చింది. ఇంతలో సినిమాకి సంబంధించిన ఓ ముఖ్య విషయం చెబుదామని ఆమె భావించింది. కానీ ఈ విషయాన్ని చెప్పకూడదని సినిమా బృందం అనడంతో 'చెప్పకూడదట' అంటూ నవ్వేసింది. దీంతో సమంత చిలిపితనం చూసి అందరూ నవ్వేశారు. ఇక ఆమె ఇన్‌డైరెక్ట్‌గా సుచీలీక్స్ గురించి మాట్లాడుతూ, ఈమధ్య కొన్ని లీక్స్ వచ్చాయి. ఇవి అందరినీ ఇబ్బంది పెట్టాయి. పైగా అందులో కొందరి పేర్లు ఉన్నాయి.
ఆ వీడియోలను సర్క్యులేట్ చేయడం వల్ల ఎంత మంది బాధపడ్డారో తెలుసా? ఆ బాధితులు పడిన బాధనే ఈ చిత్రంలో చూపిస్తున్నాం.. దీంతో మీకు ఆ బాధ ఏమిటో అర్ధమవుతుంది.. అని మాట్లాడింది. మహిళా స్వేచ్చ, పెళ్లయిన తర్వాత కూడా తన నటనను కొనసాగించడం, అక్కినేని ఫ్యామిలీలో మగవారికి సమానంగా ఆడవారికి కూడా స్వేచ్చ ఉందని చెప్పడం, నాడు మహేష్ '1'(నేనొక్కడినే) చిత్రంలోని బీచ్‌పోస్టర్‌పై మహిళల తరపున గళం ఎత్తిన సమంత, అసలు సుచిత్ర ఏమైపోయింది? ఆ లీక్స్‌లో వచ్చినవి నిజమా? కాదా? మరోవైపు సుచిత్ర ఏకంగా తనకు మత్తిచ్చి ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లు లైంగిక కోర్కెలు తీర్చుకున్నారని ఓ బాధితురాలిగా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడితే ఆమెకు జరిగిన అన్యాయం నిజమేనా? కాదా? అనేవి రెండు వైపుల నుంచి మాట్లాడకుండా సినీ పెద్దల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు అక్కినేని ఇంటి కోడలిని అయ్యాను కాబట్టి సినిమా వారికే సపోర్ట్ చేయాలి అనేలా మాట్లాడటం ఆమెకు సరికాదు. కనీసం ఆమె ఏమైపోయిందో పోలీసులు కూడా పట్టించుకోని అంశాన్ని సమంత ఎందుకు లేవనెత్తలేదు.
ఇక ఇదే సందర్భంగా ఆమె తాను నటించిన పాత చిత్రాలను చూస్తే అందులో కనిపించేది నేనేనా? అనే అనుమానం వస్తోందని ఆమె తనకు ఇంత కాలం అవకాశం ఇచ్చిన హీరోలు, దర్శక నిర్మాతలను ఆమె అవమానించిందనే భావించాలి. అవకాశం ఇచ్చిన వారిని, వాటిని ఆదరించిన ప్రేక్షకులను ఇది అవమాన పరచడమే. 'రాజుగారి గది 2' గురించి పాజిటివ్‌గా మాట్లాడవచ్చు. కానీ తన పాత చిత్రాలలో నేను ఎందుకు నటించానా? అని బాధపడుతున్నానని వ్యాఖ్యలు సమంజసం కాదు. మరి 'ఏమాయ చేసావే', 'అ...ఆ' వంటి చిత్రాలు ఆమె పేరును ఇనుమడింపజేయలేదు. అసలు పాత చిత్రాలు లేకుండా ఉంటే సమంత ఎవరో ఎవరికి తెలిసేది? దీనినే పెద్దవారు 'ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న' అనే సామెత సామ్ మాటలకు సరిగ్గా సరిపోతుంది.