తెలుగు నుంచి 'బాహుబలి-ది బిగినింగ్' వంటి చిత్రం వస్తుందని కలలో కూడా ఏ బాలీవుడ్ వ్యక్తి ఊహించి కూడా ఉండడు. కానీ 'బాహుబలి'ని చూసి నార్త్ ఇండియన్స్‌తో పాటు అన్ని భాషల వారు కలెక్షన్ల వర్షం కురిపించి, ఆహా ఓహా అనే సరికి మనం ఎందుకు ఇలాంటి చిత్రం తీయలేకపోయాం అని తీరిగ్గా అవమానంగా ఫీలయ్యారు. 'బాజీరావ్ మస్తానీ' వంటి చిత్రంతో బాలీవుడ్, 'పులి' చిత్రంతో కోలీవుడ్ వారు 'బాహుబలి'ని బీట్ చేయాలని భావించి చతికిల పడ్డారు. ఇక ఆర్బాటంగా ప్రకటించిన 'సంఘమిత్ర', మోహన్‌లాల్ వెయ్యికోట్ల 'రాండామూజం' పరిస్థితి తెలియడం లేదు. ఇలా 'బాహుబలి-ది బిగినింగ్' కి ధీటైన సమాధానం చెప్పాలనుకున్న అందరూ దెబ్బతిన్నారు.
ఇక బాహుబలి1తోనే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత వచ్చిన 'బాహుబలి-కన్‌క్లూజన్' చిత్రం అన్ని భాషలను మరింత భయపెట్టి కనీవినీ ఎరుగని షాకిచ్చింది. దీంతో హడావుడిగా అమీర్‌ఖాన్ సైతం 'దంగల్' ని చైనాలో భారీఎత్తున విడుదల చేసి 'బాహుబలి 2' కి చెక్‌పెట్టాడు. ఇక ఈ రెండింటిని బీట్ చేయగలిగిన చిత్రంగా శంకర్ '2.0' చిత్రాన్ని చెప్పుకుంటున్నారు. కానీ 'బాహుబలి'ని మార్కెట్‌చేసి విజయంలో దోహదపడి, బాగానే సొమ్ము చేసుకున్న కరణ్‌జోహార్ ఇప్పుడు 'బాహుబలి'కి చెక్ పెట్టే చిత్రం తీయనున్నట్లుగా ప్రకటించాడు. 'వేకప్ సిడ్, ఏ జవానీ హైదివానీ' వంటి లవ్‌స్టోరీస్‌ని తీసిన కాజోల్ కజిన్ అయిన కుర్రదర్శకుడు ఆయాన్ ముఖర్జీపై నమ్మకం ఉంచి ఆయనతో చిత్రం తీస్తున్నాడు. ఇదో సోషియో ఫాంటసీ చిత్రం. మొత్తం మూడు భాగాలుగా విడుదల కానుంది. టైటిల్ 'బ్రహ్మాస్త్రం'.
ఇందులో అమితాబ్‌బచ్చన్, రణబీర్‌కపూర్, అలియా భట్ వంటి భారీ క్యాస్టింగ్‌తో నింపారు. 2019 ఆగష్టు15న మొదటి భాగం విడుదల అని కరణ్‌జోహార్ ప్రకటించాడు. ఇక ఇప్పటివరకు లవ్‌స్టోరీసే తీసిన కుర్ర దర్శకునికి ఇది సాధ్యమేనా? అనే అనుమానం వస్తోంది. వాస్తవం చెప్పాలంటే 'దంగల్', '2.0' వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలే బాహుబలిని సవాల్‌చేయగలవు. కానీ బాహుబలి లాగానే ఫాంటసీ, చారిత్రక చిత్రాలంటూ భారీగా సినిమాలు తీస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లేనని చెప్పాలి. నిజానికి మరోసారి అదే 'బాహుబలి' వంటి చిత్రమే తీసి 'బాహుబలి' రికార్డులను తిరగరాయమని పట్టుబడితే రాజమౌళి కూడా మరలా అలాంటి చిత్రం తీయలేడు. ఇక త్వరలో విడుదల కానున్న 'పద్మావతి'కి ఆ అవకాశం ఉన్నప్పటికీ ఈ చిత్రం 'బాహుబలి'లా ప్రాంతీయ భాషల్లో ఆడటం కష్టమే.