కాంగ్రెస్ నాయకునిగా, పిసిసి ప్రెసిడెంట్‌గా ఉన్న తరుణంలో చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు అనూహ్య విజయం సాధించేలా ఉపయోగపడింది. దీనిని తెలుగుదేశం నాయకులు ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకే సర్వేల కోసం ఆయన పాదయాత్రలు చేశాడని విమర్శించారు. ఇక వైఎస్ హయాంలో చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశాడు. అది కూడా ఆయనకు మంచి ఫలితాన్నే అందించింది. ఇక నాటి ఎన్టీఆర్ చేసిన చైతన్యరథం యాత్రలు నాడు ఓ సంచలనం. వీటికి హరికృష్ణ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇలా ప్రతిసారి ఎవరు చేసినా కూడా ఇలాంటి పాదయాత్రలు, సభలు, సమావేశాలు, బస్సుయాత్రలు.. ఇవ్వన్నీ వేరు వేరు అయినా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, జనాలకు దగ్గర కావడానికి మైలేజ్‌కి బాగా ఉపయోగపడుతాయి.
ఇక దేశంలో 2018 అక్టోబర్‌లోనే ఎన్నికలు వస్తాయని విశ్వసనీయ సమాచారం అందుతోంది.కాస్త ముందుగానే ఎన్నికల రంగంలోకి దూకాలని మోదీ, అమిత్‌షాల యోచన. ఇదే విషయమై చంద్రబాబు కూడా తన పార్టీ నేతలకు అక్టోబర్‌లోనే ఎన్నికలు వస్తాయని అందరూ సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చాడు. తాజాగా ప్రతిపక్ష నేత జగన్ కూడా వివిధ ప్రాంతాల పార్టీ ఇన్‌చార్జ్‌లతో సమావేశమై ఎన్నికలు అక్టోబర్‌లోనే వస్తాయని చంద్రబాబు చెబుతున్నాడని తనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్‌లోనే ఎన్నికలు వస్తాయని, అందరూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పూర్తి సన్నద్దంగా ఉండాలని కోరాడు. ఇక వచ్చే నెల 2వ తేదీ నుంచి జగన్ రాష్ట్రంలోని 120 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయనున్నాడు. మిగిలిన 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తాడు. జగన్‌ది ఇది అంతిమ పోరాటం.
ఈసారి కూడా జగన్‌రాకపోతే ఇక ఆయన జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేశాడు. మొత్తానికి జగన్ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని ఆరునెలలో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నాడు. మరి ఈ పాదయాత్రలు జగన్‌కి ఎంత వరకు ఉపయోగపడతాయి? అనేది ఎదురుచూడాల్సివుంది. ఇక వచ్చే ఎన్నికల్లో దాదాపు జనరల్ నియోజక వర్గాలన్నింటిలో 50కోట్లు డబ్బున్న వారికే టిడిపి, వైసీపీలు సీట్ల విషయంలో ప్రాధాన్యం ఇస్తాయని వారి నాయకులకు అధిష్టానం ఖచ్చితంగా చెబుతోందిట. మొత్తానికి ముందస్తు ఎన్నికలు మాత్రం తప్పవనే చెప్పాలి...!