ఉన్నట్లుండి తాను తెలంగాణలో పుట్టానని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని రాములమ్మ రాజకీయాలలోకి అడుగుపెట్టింది. బిజెపిలో చేరింది. తర్వాత సొంతపార్టీ, మరలా టీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో.. ఇలా పార్టీలు మారుతూ ఉంది. ఆమె బిజెపిని విడిచి మొదటి తప్పు చేసింది. తీరా తెలంగాణ వచ్చే కొన్ని నెలల ముందే టిఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరడం మరోతప్పు. ఇక కాంగ్రెస్‌లో ఎన్నికల్లో ఓటమి చెందడం, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె కాంగ్రెస్‌లో ఉన్నదే గానీ ఆ పార్టీ తరపున మాట్లాడింది గానీ, లేదా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడింది గానీ ఏమీ లేదు. కనీసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నైతిక మద్దతు ఇచ్చింది కూడా లేదు.
మద్యలో అమ్మ చనిపోయిన తర్వాత చెన్నై వెళ్లి పిన్నమ్మ శశికళను జైలులో కలుసుకుని శశికళను పొగడ్తలతో ముంచెత్తింది. తమిళనాడులో కూడా ఆమెకి సినీ క్రేజ్ బాగా ఉంది. దాంతో ఆమె తెలంగాణ వదిలేసి తమిళ రాజకీయాల వైపు వెళ్తుందనే వార్తలు వచ్చాయి. కానీ అక్కడ శశికళను పొగిడి సీఎంగా ఆమే ఉండాలని ప్రకటన చేయడంతో తమిళనాడు ప్రజలు, సినీపెద్దలు, వివిధపార్టీల నాయకులు ఆమెపై మండిపడ్డారు. మా రాష్ట్రం గురించి మేము చూసుకుంటాం... నీవు నీ రాష్ట్రానికి వెల్లమని ధ్వజమెత్తారు.
ఇక ఆమెకు త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన పదవి ఇవ్వాలని భావిస్తోందిట. ఏఐసిసి కార్యదర్శిగా, లేదా పీసీసీ ప్రచారకమిటీ బాధ్యతలను విజయశాంతికి అప్పగించాలని, ఆమెకున్న సినీక్రేజ్ ఎన్నికల నాటికి తమకి ఉపయోగపడుతుందని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న అధిష్టానం ఆమెకు పెద్ద పీట వేయాలని భావిస్తోందని తెలిసి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఇతరనాయకులు మండిపడుతున్నారు. మూడున్నర ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, టీఆర్‌ఎస్‌పై పోరాటం చేస్తున్న తమను కాదని ఇప్పుడు విజయశాంతికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నోగ్రూప్‌లు ఉన్నాయి. ఈ లుకలుకలు మీడియా దాకా ఎక్కుతున్నాయి. ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి, కోమిటిరెడ్డిల మద్య పోరు రచ్చకెక్కుతోంది. సో.. రాములమ్మకే ప్రధానమైన పదవి ఇస్తే మాత్రం ఈ లుకలుకలు మరింతగా పెరగడం ఖాయం. ఇక ఎన్నికల నాటికి ఏపీలో కూడా పార్టీకి అంటిముట్టనట్లు ఉంటోన్న చిరంజీవి అలాంటి పదవే ఇవ్వాలని భావిస్తున్నారట. మరి చిరు ఎలా స్పందిస్తాడో చూడాలి? ఏదిఏమైనా ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోకపోవడం కాంగ్రెస్ దౌర్భాగ్యం.