ఈ మధ్యకాలంలో తెలుగులో మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ షూటింగ్ జరిగినంత కాలం సినిమాని ప్రేక్షకుల నోట్లో నానేలా చేసి, ప్రమోషన్స్ చేస్తూ, సినిమా రిలీజ్ నాటికి హైప్ వచ్చేలా చూసి ఓపెనింగ్స్‌ని కొల్లగొట్టడంపైనే మన మేకర్స్ దృష్టిపెడుతున్నారు. ఒకప్పుడు చిత్రం ప్రారంభోత్సవం, మద్యలో సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పడానికి ఒకటి రెండు ప్రెస్‌మీట్లు, తర్వాత ఏకంగా ఆడియో వేడుక, రిలీజ్‌కి ముందు మీడియాకి ఇంటర్వ్యూలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్‌లుక్, టైటిల్, టీజర్, స్టంపర్, ట్రైలర్, థియేటికల్ ట్రైలర్స్, ఒక్కోపాటను రిలీజ్ చేయడం, ప్రీరిలీజ్ వేడుకలు.. వీటితో పాటు మేకింగ్ వీడియోస్ వంటివి పలు వచ్చి చేరాయి. ఒకప్పుడు కేవలం కొన్ని హాలీవుడ్ చిత్రాలు, బ్రూస్‌లీ, జాకీచాన్ నటించిన చిత్రాలలో చివరన టైటిల్స్ వేసేటప్పుడు ఆ చిత్రంలోని సీన్స్, యాక్షన్‌సీన్స్ చేసే షూటింగ్‌కి చెందిన దృశ్యాలను చూపించేవారు. కానీ ఇప్పుడు నెలకో మేకింగ్ వీడియో రిలీజ్ అవుతోంది.
'బాహుబలి'తో తెలుగులో దీనికి విపరీతమైన ప్రాచుర్యం తెచ్చి, సినిమా ప్రమోషన్లలో వీటిని కీలకం చేసిన వ్యక్తి రాజమౌళి. ఇక తాజాగా క్రిష్ దర్శకత్వంలో కంగనారౌనత్ తో రాణి ఝాన్సీలక్ష్మీభాయ్ గాధను 'మణికర్ణిక'గా తీయనున్నారు. ఈ చిత్రంలో యుద్ద విన్యాసాల కోసం కత్తిసాము నేర్చుకుంటున్న కంగనా వీడియో విడుదలైంది. ఇప్పుడు రాజమౌళి 'బాహుబలి' రూట్‌లోనే నడవాలని ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న 'సాహో' చిత్రానికి కూడా ఫాలో అవుతున్నారు.
ఈనెల 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని, ఓ మేకింగ్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ప్రీ టీజర్‌ని విడుదల చేసిన ప్రభాస్ అండ్ టీం 'సాహో' మేకింగ్ వీడియోల ద్వారా తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆసక్తిని క్రియేట్ చేసుకుంటూ వెళ్లాలని భావిస్తున్నారు. ఏదిఏమైనా ఇవ్వన్నీ మొదటి వీకెండ్ వరకు మాత్రమే పనిచేస్తాయి. ఏమైనా కంటెంట్‌లో తేడా వస్తే మాత్రం ఇవేమీ సినిమాను కాపాడలేవు. ముందుగా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఇవ్వన్నీప్లస్‌లు అవుతాయి. ఏమీ లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు.