ఒకప్పటిలా థియేటర్లకు వెళ్లి విడుదలైన అన్నిచిత్రాలను ఫ్యామిలీతో చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ఒకవైపు సామాజిక మాద్యమాలతో పాటు వినోద కార్యక్రమాలు, వినోద యాత్రలు నేడు జనాలకు ఎక్కువ ఆప్షన్స్ ఉండేలా చేస్తున్నాయి. రోజుకి ఒక్కో చానెల్‌లో బోలెడన్ని సినిమాలు, సీరియళ్లు, రియాల్టీ షోలతో బుల్లితెర వినోదాల విందుగా మారింది. ఒకప్పుడు కొత్త చిత్రం వచ్చిందంటే మొదటి రోజే మహిళలు బారులుతీరి థియేటర్లలో క్యూలలో నిలుచునే వారు. మొదటగా మహిళలకు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత మిగిలితేనే మగవారికి టిక్కెట్లు ఇచ్చేవారు. అది ఒకప్పుడు మాట.
నాడు సినిమా తప్ప చవకైన వినోద సాధనం ఫ్యామిలీ ఆడియన్స్‌కి లేదు. కానీ నేడు 200రూపాయలకే నెలంతా డిష్ కనెక్షన్ వస్తున్న డిజిటల్ రోజులు. కాబట్టి నేటి చిత్రాలు ఖచ్చితంగా రెండు మూడు వారాలకే ఫుల్‌రన్ ముగుస్తోంది. పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలు కూడా మొదటి వీకెండ్‌లోనే హవా చూపిస్తున్నాయి. సినిమాలో సత్తా లేకపోతే సెకండ్ వీకెండ్ వరకు థియేటర్‌లో సినిమా ఉండటం లేదు. అందునా సినిమాని థియేటర్‌లో చూడాలని భావించే వారు కూడా ఒకేసారి మూడు నాలుగు చిత్రాలు విడుదలైతే రివ్యూలు, టాక్ కనుక్కుని ఏది బాగుంటే ఆ ఒక్క సినిమానే చూస్తున్నారు. కానీ మన ఫిల్మ్‌మేకర్స్ మాత్రం ఒకరిపై ఒకరు పోటీ పడి సినిమాలు విడుదల చేస్తున్నారు.
ఒకే రోజున నాలుగైదు చిత్రాలను వదులుతున్నారు. అదేమంటే పండగ సీజన్‌కి మూడు నాలుగు సినిమాలను తట్టుకునే సత్తా మనకి ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత పండగ సీజన్ అయినా మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నట్లుగా తయారవుతోంది. కానీ ఈ వాస్తవాన్ని అనవసర పోటీలకు పోయే మేకర్స్‌గానీ, ఫ్యాన్స్ గానీ గుర్తించడం లేదు. ఆగష్టు11న లాంగ్‌వీకెండ్‌లో పోటీ వద్దని అందరు విశ్లేషిస్తున్నా కూడా నితిన్ 'లై', బోయపాటి 'జయ జానకి నాయకా', రానా 'నేనే రాజు నేనే మంత్రి' అని విడుదల చేశారు. మూడు చిత్రాలు చూడదగ్గ చిత్రాలే అయినా అన్ని రావాల్సిన వసూళ్ల కంటే తక్కువనే రాబట్టి కలెక్షన్లును చీలగొట్టేసుకున్నారు.
ఇక విషయానికి వస్తే మన వారి కంటే చాలా విషయాలలో బాలీవుడ్ మేకర్స్ గ్రేట్ అని చెప్పాలి. పెద్ద సినిమాలకు వారు సినిమా ప్రారంభం రోజే రిలీజ్ డేట్ ప్రకటించి మిగిలిన నిర్మాతలకు సంకేతాలిస్తారు. దాంతో పెద్ద చిత్రాల విడుదల తేదీలకు అడ్డుపడకుండా మిగిలిన నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ని చూసే అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్న సంజయ్‌లీలాభన్సాలీ తెరకెక్కిస్తున్న రాజ్‌పుత్‌రాణి 'పద్మావతి' చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. దీనిలో దీపికా పదుకొనే రాణిగా అదరగొడుతూ ఉంటే షాహిద్‌కపూర్, రణవీర్ సింగ్‌లు అద్భుతంగా నటించారని విడుదలకు ముందే బీటౌన్ కోడై కూస్తోంది.
దీంతో రేడియో జాకీ సులోచనగా విద్యాబాలన్ నటిస్తున్న 'తుమ్హారీసులు'ని కూడా ముందు అదే తేదీన విడుదల చేయాలని భావించారు. విద్యాబాలన్ చిత్రాలంటే ఎంతో వైవిద్యంగా ఉంటాయని తెలిసినా కూడా ఈ చిత్రం మేకర్స్ రాణి 'పద్మావతి' కంటే ఓ వారం ముందున అంటే నవంబర్ 24న రావాలని భావించారు. కానీ 'పద్మావతి' ట్రైలర్ చూసిన తర్వాత తమ చిత్రం దానికంటే రెండు వారాలు గ్యాప్‌లో ముందుగా తేవాలని నవంబర్ 17కి వచ్చేశారు. ఎంతైనా ఇలా తగ్గడం అనేది మంచి పరిణామం. అలవి కాని చోట అధికులమని వాదించరాదని పెద్దలు చెప్పింది అందుకే...!