త్వరలో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని బాలయ్య చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తానే చేస్తానని బాలయ్య ప్రకటించాడు కూడా. ఇక ఈ చిత్రం ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి? అనే విషయం తనకు ఎవ్వరూ చెప్పనక్కరలేదని ఆ విషయం తనకు తెలుసునని ఆయన ప్రకటించాడు. ఈ చిత్రంలో పాలుపోసుకుని, సబ్‌రిజిష్ట్రార్ ఉద్యోగం తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి ఆయన వెండితెరను ఏలిన విధానం, తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన గద్దెనెక్కి సంచలనం సృష్టించి పాలనతో ఆయన చూపిన నూతన ఒరవడి, ఎన్టీఆర్ ఎలా మహానుబాహుడు అయ్యాడు? ప్రజలకు ఆయన దైవంగా ఎలా మారాడు? వరకే ఈ చిత్రం స్టోరీ ఉంటుందని సమాచారం.
ఇక 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు, కృష్ణంవందేజగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీనెంబర్ 150, గోపాల గోపాల' వంటి చిత్రాలకు మాటలు అందించి మరీ ముఖ్యంగా బయోపిక్ అయిన బాలకృష్ణ వందో ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి అద్భుతమైన సంభాషణలు అందించిన సాయి మాధవ్ బుర్రా, బాలయ్య చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌కి మాటలు రాయనున్నాడని సమాచారం. 'సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?' వంటి డైలాగ్స్‌కి బాగా ముగ్దుడైన బాలయ్య ఈ బయోపిక్‌కి ఆయనే స్వయంగా సాయి మాధవ్‌బుర్రా పేరును రికమెండ్ చేశాడని సమాచారం. ప్రస్తుతం ఆయన సావిత్రి బయోపిక్ 'మహానటి'కి కూడా సంభాషణలు అందిస్తున్నాడు. ఇక ఆయన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సమయంలోనే 'ఖైదీనెంబర్ 150'కి మాటలందించాడు.
తాజాగా చిరంజీవి 'సై..రా.. నరసింహారెడ్డి' బయోపిక్‌కు కూడా రచయితగా పనిచేస్తున్న సమయంలోనే బాలకృష్ణ చేసే ఎన్టీఆర్ బయోపిక్‌కి రాయనుండటం విశేషం. ఇక బయోపిక్స్ అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'మహానటి', 'సై..రా..నరసింహారెడ్డి'లతో పాటు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌కి కూడా రచయితగా పనిచేయనుండటంతో ఈయనకు బయోపిక్స్ తరహా చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయని చెప్పవచ్చు. మరోవైపు ఈచిత్రాన్ని బాలకృష్ణ, వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటిలు కలిసి ఓ నూతన బేనర్‌ని స్థాపించి అందులో మొదటి చిత్రంగా ఎన్టీఆర్ బయోపిక్‌ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇక ఈచిత్రానికి దర్శకునిగా దాదాపు తేజ కన్‌ఫర్మ్ అయినట్లేనని చెప్పాలి.