ఒక్క మాట చెప్పాలంటే సినిమా వారు చెడిపోయారు.. మామూలు వారు చెడిపోయారు. చివరకు మీడియా కూడా తన విలువలను పోగొట్టుకుందనే ఒప్పుకోవాలి. సోషల్‌మీడియా బాగా విస్తరించడంతో ఏ చిత్రం పోస్టర్, టీజర్, ట్రైలర్ విడుదలైనా కూడా ఫలానా ఇంగ్లీషు చిత్రం నుంచి ఇది కాపీ కొట్టారు. ఫలానా కొరియన్, చైనీస్, ఫ్రాన్స్ భాషా చిత్రాల నుంచి ఫలానావి చోరీ చేశారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇక విషయానికి వస్తే కాపీ కొట్డడం తప్పే గానీ ఓ సినిమా నుంచి లేదా ఓ పాత్ర నుంచి ఇన్‌స్పిరేషన్ పొందడం తప్పేమి కాదు. అలా చెప్పుకుంటే 'గాడ్‌ఫాదర్' చిత్రం స్ఫూర్తితో ఎన్ని వందల చిత్రాలు ఎన్ని భాషల్లో రూపొందాయో లెక్కే లేదు. కమల్‌హాసన్ 'నాయకుడు', వర్మ 'సర్కార్' వంటి చిత్రాలన్నీ అదే కోవలోకి వచ్చేవే.
ఇక సంజయ్‌లీలా భన్సాలి కాస్త చరిత్రను వక్రీకరిస్తాడనే పేరున్నప్పటికీ ఆయనను మంచి మేకర్‌గా చెప్పాల్సిందే. ఏమి చేసినా మన అభిమానంతో మనం వాటిని 'బాహుబలి'తో పోలుస్తాం గానీ 'బాజీరావ్ మస్తానీ' చిత్రాన్ని కూడా ఆయన బాగానే తీశాడు. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. దాంతో కసితో ఆయన 'పద్మావతి' చిత్రం తీసినట్టు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. ఇక అన్ని చిత్రాలు 'బాహుబలి'లా కలెక్షన్లు, రికార్డులు సృష్టిస్తాయా అంటే మరలా అంతటి కలెక్షన్లు, రికార్డులు రావడం మరలా రాజమౌళికి కూడా వీలుకాదేమోనని చెప్పాలి. కానీ కంటెంట్ పరంగా చూస్తే మాత్రం 'పద్మావతి' ట్రైలర్ అదిరింది. కథలోని కంటెంట్, నటీనటుల నటనా ప్రతిభ, గ్రాండ్ విజువల్స్, అత్యద్భుతమైన టేకింగ్.. ఇలా ప్రతి ఒక్కటి అదిరిపోయే లెవల్‌లోనే ఉంది. ఆకర్షణీయమైన విజువల్స్, స్టన్నింగ్ మ్యూజిక్ చూసి తీరాల్సిందే. ఈ ట్రైలర్ సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా ఈ చిత్రం మొదటి నుంచి వివాదాలలోనే ఉంటూ ఉంది. ఓ ముస్లింరాజైన అల్లావుద్దీన్‌ఖిల్జీకి లొంగకుండా ధైర్యసాహసాలతో తనను తాను బలి తీసుకున్న వీరనారి, వీర రాణి పద్మావతికి అల్లా వుద్దీన్ ఖిల్జీకి మద్య ప్రేమాయణం నడిపినట్లు చూపిస్తున్నారని, రాణి పద్మావతికి చెందిన భక్తులమని చెప్పుకునే కర్ణిసేన సైనికులు తుపాకులు, ఆయుధాలతో షూటింగ్‌ను ధ్వంసం చేసి, కాల్పులు జరిగి నానా భీభత్సం సృష్టించారు. కానీ తాను ఏమి తీస్తున్నానో నా యూనిట్‌కే తెలియనప్పుడు పద్మావతిని తప్పుగా చూపిస్తున్నానని మీరు ఎలా చెప్పగలరు? అని సంజయ్‌లీలా భన్సాలీ వాదించాడు. నాటి నుంచి ఈ చిత్రం వార్తల్లో ఉంది.
కానీ ఈ చిత్రం ట్రైలర్‌ని చూసి షాహిద్‌కపూర్‌ని బాగా చూపించలేదు. పద్మావతిలో లుక్ మిస్సైంది. అల్లావుద్దీన్‌ఖిల్జీగా నటించిన రణవీర్‌సింగ్ గెటప్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లోని విలన్ కాల్ డోగ్రో గెటప్‌ని దించేశారని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం దర్శకుడి పడిన కష్టాన్ని కూడా ఇలా అవమానిస్తున్నారు. ఇక ట్రైలర్ బాగా లేదని ఒప్పుకున్నా, ట్రైలర్ బాగా లేకపోయినా బాగున్న చిత్రాలు, బాగా ఆడిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అయినా విదేశీ భాషలోని పాత్రను మన నేటివిటీకి తగ్గట్లుగా అందరినీ అలరించేలా కాపీ కొట్టడంలో తప్పేమి లేదు...అది కూడా క్రియేటివిటీలో భాగమేనని చెప్పాలి.....!