ప్రస్తుతం బాలయ్య, వర్మలు పోటాపోటీగా తీయనున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలే తీవ్ర చర్చనీయాంశాలు అవుతున్నాయి. బాలయ్య బయోపిక్‌లో వివాదాలు ఉండవు. కేవలం ఎన్టీఆర్‌ని మహనీయునిగా చూపించే పనే కావడం, అందులోనూ తన తండ్రి పాత్రను తానే చేస్తానని బాలయ్య చెప్పడంతో దానిపై పెద్దగా ఆసక్తి లేకున్నా, వర్మ తీసే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కాన్సెప్ట్ మూవీనే అందరిలో గుబులురేపుతోంది. ఇక నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్రాన్నిశాసిస్తున్న రోజుల్లోనే సూపర్‌స్టార్ కృష్ణ ఎన్టీఆర్‌పై వ్యంగ్యాస్త్రంగా 'మండలాధీశుడు' చిత్రం తీశాడు. ఇందులో అప్పుడే నటునిగా ఎదుగుతున్న కోట శ్రీనివాసరావును ఎన్టీఆర్ పాత్రకు తీసుకున్నాడు. ఆ పాత్రలో కోట అదిరింది అనిపించాడు. కానీ సినిమాని సినిమాగా చూడటం ఆ రోజుల్లోనే లేదు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి కార్యకర్తలు తనను చంపబోయారని, ఎన్టీఆర్ కూడా పిలిచి 'చేశారు.. కదా.. చూద్దాం' అని కోపంతో అన్నాడని కోటనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇక తెలుగుదేశం వ్యవస్థాపకుల్లో ఒకరైన నటుడు కైకాల సత్యనారాయణ సైతం కృష్ణ నటించిన 'సాహసమే నా ఊపిరి' చిత్రంలో ఎన్టీఆర్‌కి పేరడీగా సత్యనారాయణ చేత కాషాయం వస్త్రాలు వేయించి, ఎన్టీఆర్‌ని ఎండగట్టారు. స్వతహాగా ఎన్టీఆర్ మనిషే అయినా సత్యనారాయణ దానిని ఒక పాత్రగా, తనను తాను ఓ కళాకారునిగా మాత్రమే భావించాడు. ఇక 'గండిపేట రహస్యం' అనే చిత్రం కూడా వచ్చింది. చివరకు ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి ఫ్యాన్స్ కృష్ణని రాళ్లతో కొట్టి ఆయన కన్నుపోయేంత పనిచేశారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ హవా ఉంది. ముఖ్యంగా ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉంది. మరి వర్మ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను చేయడానికి ఎవరు తెగిస్తారు? అనే చర్చ సాగుతోంది. వర్మ మాత్రం ఈ పాత్రకు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ని తీసుకోవాలని భావిస్తున్నాడట.
వర్మ దర్శకునిగా ఎలాంటి సంచలనమో, ఎవరి మాటా ఎలా వినడో.. ప్రకాష్‌రాజ్ కూడా అదే స్థాయిలో అన్నట్లుగా వివాదాలతో ఉంటాడు. ఆయనకు పాత్ర వస్తే ఏదైనా చేస్తాడు. అందునా ఆయన తెలుగువాడు కాదు. నందమూరి ఫ్యామిలీతో ఆయనకు పెద్దగా టచెస్ కూడా లేవు. కాబట్టి ఆయన ఆ పాత్రకు ఒప్పుకునే అవకాశాలే ఉన్నాయి. అలా కానీ విషయంలో తన నిజజీవిత ఆధారిత సబ్జెక్ట్‌లకు క్యారెక్టర్స్‌కి తగ్గ ఆర్టిస్టులను ఎంచుకోవడం, వారి గెటప్, ఆహార్యం, నటన, గాంభీర్యం, డైలాగ్ డెలివరి, చూసిన వెంటనే అచ్చు అలాగే ఉన్నాడే అనేలా ఆర్టిస్టులను ఎంపిక చేసి అవుట్‌పుట్ రాబట్టడంలో వర్మ నేర్పరి, పరిటాల రవి, సూరి, వంగవీటి, వీరప్పన్, దావూద్, బాల్‌థాక్రే, కసబ్‌ల వంటి పాత్రల కొరకు ఆయన తీసుకున్న ఆర్టిస్టులను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇక 'రక్తచరిత్ర'లో కొద్ది సేపు ఉండే ఎన్టీఆర్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ శత్రుఘ్నుసిన్హా చేత వర్మ అదరగొట్టించాడు. కాబట్టి మన నటుటు కాదన్నా అంతకు మించిన వారినే వర్మ తెస్తాడనడంలో సందేహం లేదు...!