మన ఇండస్ట్రీ వారు కథలు లేవు.. మంచి కథలు రావడం లేదు అంటూ ఉంటారు గానీ నిజజీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు సినిమాలకు ఇతివృత్తంగా మారే అవకాశాలు ఉన్నవే ఉంటాయి. అయితే దానిని చూసే దృక్కోణం ముఖ్యం. అందరికంటే విభిన్నంగా ఆ సంఘటనలకు స్పందించేవారికి శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల, ఆడపిల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగానే సినిమా కథలు కూడా అంతే. బాలీవుడ్, కోలీవుడ్‌లలో అలాంటి కోణాలు మనకి బాగా కనిపిస్తాయి.
ఇక విషయానికి వస్తే నాడు మహేష్ నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలైన సమయంలోనే విడుదలైన ఎవ్వరీకీ పెద్దగా పరిచయాలు లేనివారితో వచ్చిన 'బిచ్చగాడు' చిత్రం సంచలన విజయం సాధించింది. ఇందులో హీరో తల్లి ఆరోగ్యం కోసం మిలియనీర్ కూడా బిచ్చగాడిగా గడుపుతాడు. ఇక తమిళనాడుకు చెందిన నటరాజన్ అనే వ్యక్తి వ్యవసాయం పనులు చేసుకుంటూ పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. ఆయనకు ఓ భార్య, ముగ్గురు కుమారులు. కుమారుల్లో ఒక వ్యక్తికి ఇటీవల వివాహం జరిగింది. కానీ కోడలు తనను ఏదో అనడంతో ఆత్మాభిమానం కొద్ది ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాష్ట్రమంతా తిరిగి, ఓ ఊర్లో సుబ్రహ్మణ్యస్వామి గుడి ఎదుట బిక్షం ఎత్తుకుంటూ, గుళ్లో పెట్టే ప్రసాదం, అన్నదానాలలో తింటూ కాలం వెళ్లదీశాడు.
ఇక ఆయన కోసం కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికి చివరకు ఆ గుడిలో నటరాజన్ కనిపించాలని మొక్కుకునేందుకు వచ్చారు. వారు అక్కడ బిచ్చగాడిలా ఉన్న నటరాజన్‌ని చూసి తమ తప్పు తెలుసుకున్నామని, దయచేసి క్షమించి ఇంటికి రావాలని కోరడంతో ఆయన కారులో తన ఊరికి వెళ్లిపోయాడు. అప్పటిదాకా తమతో బిచ్చం ఎత్తుకున్న వ్యక్తి కోటీశ్వరుడని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టే సినిమా అనేది ఎంతో ప్రభావవంతమైన మాధ్యమంగా అందరూ చెబుతారు.