సినిమా కోసం యూనిట్ అంతా అహర్నిశలు కష్టపడేది.. నిర్మాతలు కోట్లలో పెట్టుబడి పెట్టేది విజయం కోసమే. విజయం అంటే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తేనే సాధ్యమవుతుంది. ఇక తెలుగులో ఇప్పుడిప్పుడే కాన్సెప్ట్ చిత్రాల హవా మొదలైంది. నటీనటులు, దర్శకులు, ప్రేక్షకులు కూడా వాటిని బాగా ఆదరిస్తున్నారు. దీంతో కాన్సెప్ట్ చిత్రాలను తీయాలని పలువురు పోటీ పడుతున్నారు. ఇక గీతాఆర్ట్స్ విషయానికి వస్తే టాలీవుడ్‌లో అగ్రనిర్మాణ సంస్థగా దీనికి పేరుంది. అప్పుడప్పుడు అల్లుఅరవింద్ ఇతర నిర్మాతలతో కలిసి కొన్ని లోబడ్జెట్ చిత్రాలను తీసి కూడా మెప్పించాడు. ఇక స్థాపించి ఇన్నేళ్లయినా ఇప్పటికీ గీతాఆర్ట్స్ సక్సెస్ రేటు బాగా ఉండటానికి అల్లుఅరవింద్ దీక్ష, దక్షతలతో పాటు మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా చిత్రాలు తీస్తూరావడం కూడా ఓ ముఖ్యకారణం.
కానీ తర్వాత చిన్న చిత్రాలకు పెద్దగా ఆదరణ లేని రోజుల్లో ఆయన కేవలం స్టార్స్‌తోనే చిత్రాలు తీయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్ చిత్రాలను ముందుగా అనుకున్న బడ్జెట్‌తో తీయడం ఆయనకే చెల్లింది. అయినా కూడా కొత్త కాన్సెప్ట్ చిత్రాలతో, మరీ ముఖ్యంగా చిన్న, మద్యస్థాయి హీరోలతో సినిమాలు తీసేందుకు బన్నీవాసు సారధ్యంలో గీతాఆర్ట్స్2 అనే అనుబంధ సంస్థను స్థాపించాడు.
ఇక తాజాగా ఆయన యువిక్రియేషన్స్ అధినేతలైన వంశీ, ప్రమోద్, విక్కీ, తమిళ స్టార్ నిర్మాత జ్ఞానవేల్‌రాజాల కలయికలో వి4 అనే నూతన నిర్మాణ సంస్థని స్థాపించి, అందులో మొదటి చిత్రంగా తమిళ రీమేక్ చిత్రాన్ని ఈటీవీ ప్రభాకర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి' చిత్రం చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే మంచి కాన్సెప్ట్ చిత్రాలు, యూత్, టాలెంట్ అని పెద్ద పెద్ద మాటలు చెబుతోన్న ఈ సంస్థ అధినేతలు తొలి చిత్రంగా ఓ తమిళ రీమేక్‌ని ఎంచుకోవడం చూస్తే మాత్రం మన భావదారిద్య్రం ఇంకా పోలేదా? అనిపించకమానదు.