తెలుగు మాట్లాడటంలో హావభావాలు, పదాలను ఒత్తిపలకడంతో ఒకప్పటి టీవీ చానెల్స్ హోస్ట్ ఓంకార్ అన్నయ్య మీద కూడా పలు సెటైర్లు వినిపించేవి, మంచు లక్ష్మిలా ఆయనలో కూడా ఏదో కృత్రిమంగా కనిపించేది. అలాంటి ఓంకార్ దర్శకునిగా మారిన తర్వాత రెండో చిత్రంగా 'రాజు గారి గది' సినిమాకి దర్శకత్వం వహించాడు. పనిలో పనిగా తన తమ్ముడిని కూడా హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక కొన్ని చిత్రాలు ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో? కొన్ని ఎందుకు కావో? ఎవ్వరికీ అర్ధం కాదు. అలా చిన్న సినిమాగా విడుదలైన 'రాజు గారి గది'తో పెద్ద హిట్ కొట్టాడు. ఇక ఆయన దీనికి సీక్వెల్‌గా ఓ కథను రాసుకుని విక్టరీ వెంకటేష్‌ని వినిపించినా ఆయన 'గురు' చిత్రం బిజీలో ఉండటంతో దానిని చేయలేకపోయారట. అదే సమయంలో ఆయనకు పివిపి వారు పరిచయం కావడం, పివీపి వారు అండగా నిలబడటంతో పాటు మలయాళ 'ప్రేతమ్' లింక్‌ని కూడా ఆయనే ఓంకార్‌కి పంపించాడట. కానీ ఈ చిత్రాన్ని పూర్తిగా రీమేక్ చేస్తే ఆడదని తెలుసుకుని, ఆ సినిమాలోకి ఆత్మను మాత్రం తీసుకుని, మిగిలిన కథనంతా తానే తయారు చేసుకున్నాడు.
ఇదే సమయంలో 'మ్యాట్నీ సంస్థ' అధినేత నిరంజన్ రెడ్డి మెంటలిస్ట్ పాత్రకు నాగార్జున, ఆత్మ పాత్రకు సమంతలైతే బాగుంటారని చెప్పడం నాగార్జున, సమంతలు కూడా ఒకే సిట్టింగ్‌లో ఓకే చేసేయడంతో సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఫుల్‌బౌండెడ్ స్క్రిప్ట్ తయారు అయ్యేదాకే నేను సలహాలు, సూచనలు ఇస్తాను. సినిమా మొదలైందంటే మాత్రం సినిమాకి, నాకు నువ్వే బాస్ అని చెప్పారట. అన్నట్లుగానే ఆయన ఎక్కడా ఇబ్బందిపెట్టకుండా ఎన్ని టేక్స్ అయినా చేశాడట కింగ్ నాగార్జున. మంచి సినిమా, సీన్స్ కోసం రీటేక్‌లు తప్పలేదని ఓంకార్ చెబుతున్నాడు.
ఇక 'బొమ్మరిల్లు' చిత్రంలోని క్లైమాక్స్ లో రాసిన మాటలు, మాటల రచయిత అబ్బూరి రవికి ఎంతటి పేరును తెచ్చాయో.. ఈ చిత్రం క్లైమాక్స్‌కి కూడా అంతే గొప్ప పేరు వస్తుంది. ఇక ఈ సినిమా చూసి బయటికి వస్తే చిత్రంలో ఎన్ని పాత్రలు ఉన్నా నాగార్జున, సమంతల పాత్రలు మాత్రం కలకాలం గుర్తుంటాయని, మామా కోడళ్లు తమ పాత్రలను అదరగొట్టారని అంటున్నాడు. ఇక ఇటీవల నాగ్ గ్రాఫిక్స్ పనులు హైదరాబాద్‌లో చేద్దామని చెబితే, ముంబై వెళ్లారని, దర్శకులకు టైమ్‌సెన్స్ కూడా ఉండాలని వ్యాఖ్యానించడానిపై ఓంకార్ స్పందిస్తూ.. ముంబైలో మంచి క్వాలిటీతో గ్రాఫిక్స్ చేయించాం. అవుట్‌పుట్ చూసి నాగార్జున గారు బాగా హ్యాపీ అయ్యారు.
ఇక నాగార్జున గారిది 30ఏళ్ల అనుభవం. నాది మూడు చిత్రాల అనుభవమే. నేను నాగార్జునగారి మాటలకు పాజిటివ్‌గానే తీసుకున్నానని, ఇక ఈ చిత్రంలో సమంత ఆత్మ కనుక ఈ చిత్రం చూడనని నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా అన్నాడని, కానీ సినిమా విడుదలై స్పందన చూసిన తర్వాత వారు కూడా సినిమా చూస్తారనే నమ్మకాన్ని ఓంకార్ వ్యక్తం చేశాడు. మరి ఈ శుక్రవారం ఈచిత్రం విడుదలైన తర్వాత ఓంకార్ చెప్పిన గొప్పగొప్ప మాటలపై ఓ నిర్ణయానికి రావచ్చునని చెప్పాలి.