కమల్‌హాసన్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడిన తర్వాత ఆయన పాత చిత్రాలను మనం ఎన్నో డబ్‌లు చేసి చూశాం. ఇక రజనీ 'బాషా' తర్వాత ఆయన చిత్రాలన్నీ తెలుగులో కూడా వచ్చేస్తున్నాయి. వీరి విషయం పక్కనపెడితే విక్రమ్ నుంచి కార్తి వరకు తెలుగులో ఎవరికైనా ఒక్క హిట్ పడితే చాలు ఆల్‌రెడీ తెలుగు రీమేక్ అయిన చిత్రాలను కూడా వేరే టైటిల్ పెట్టి ఆ హీరో పాత సినిమాలన్నింటిని బయటికి తీసి దుమ్ముదులిపి డబ్బింగ్ చేసి పారేస్తారు. చివరకు ఆ చిత్రంలో ఆ పాత్ర నిడివి తక్కువే అయినా అతనే పూర్తి స్థాయి హీరో అనే లెవల్‌లో బిల్డప్ ఇస్తారు. గతంలో ఇలాంటివి సాయికుమార్, థ్రిల్లర్‌మంజు, ఉపేంద్ర వంటి వారి విషయంలో కూడా ఎన్నో జరిగాయి.
ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ పాత్ర చిత్రాలను కూడా హిందీలో కేవలం ఛానెల్స్ కోసమే కోట్లు ఖర్చుపెట్టి ఫ్లాప్ సినిమాలను కూడా కొంటున్నారు. ఇక విషయానికి వస్తే 'ప్రేమమ్' చిత్రంలో మల్లార్‌గా నటించిన సాయిపల్లవి ఈమద్య 'ఫిదా' చిత్రం ద్వారా తెలుగులో కూడా సెన్సేషనల్ విజయం సాధించి 50కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో సాయిపల్లవి గతంలో నటించిన చిత్రాలపై మన చిన్న, అనామక, ప్రేక్షకులను బకరా చేసే నిర్మాతల కన్నుపడింది. 'ప్రేమమ్' తర్వాత ఆమె 'కాలి' అనే చిత్రంలో నటించింది. ఇందులో మమ్ముట్టి తనయునిగా, 'ఓకే బంగారం'లో హీరోగా, రూపొందుతున్న 'మహానటి' చిత్రంలో జెమినిగణేషన్‌గా నటిస్తున్న దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. దాంతో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ని కొన్ని'హేయ్...పిల్లగాడా' అంటూ విడుదల చేస్తున్నారు.
ఆల్‌రెడీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, పాటలు కూడా విడుదలయ్యాయి. తాజాగా ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని కూడా పూర్తిగా సాయిపల్లవిని హైలేట్ చేస్తూ కట్ చేయడం విశేషం. అయితే ఇలాంటి చిత్రాలను తమ అదుపులో లేకుండా డబ్ అయిపోతూ ఉంటే ఆ నటీనటులకు బాధగానే ఉంటుంది. ఆ విషయంలో వారు ముందుగా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకోకపోవడం ప్రధాన సమస్య. ఇలా సాయి పల్లవి అనుమతి లేకుండా వస్తోందని కాబోలు ఈ చిత్రానికి ఆమె సొంత డబ్బింగ్ చెప్పకపోవడంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పించి, అందిన కాడికి ప్రేక్షకులను కొత్త సినిమా అనే మభ్యపెట్టి ప్రేక్షకులను మోసం చేసి దోచుకోవడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.