ఇక 'అంబికా దర్బారు బత్తిని మర్చిపోలేం.. అమ్మని మర్చిపోలేం' అన్నట్లుగా ఇంతకాలం బాలయ్యను నమ్ముకున్నందుకు అంబికాకృష్ణకు ఏపీ ఫిల్మ్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి వచ్చిన సంగతి తెలిసిందే. ఈయనకు అటు చంద్రబాబు, బాలయ్యలతోనూ ఇటు హరికృష్ణ, జూనియర్‌లతో కూడా బాగానే సంబంధాలున్నాయి. ఇక బాబాయ్, అబ్బాయ్‌లైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చెప్పడానికి ఏమీ లేదు.. మా బాబాయ్‌కి శుభాకాంక్షలు అని చెబుతున్నా కూడా దాయాదుల పోరు ఉధృతంగానే ఉంది. తనను, తన తండ్రి హరికృష్ణని, తన సోదరుడు కళ్యాణ్‌రామ్‌లను చంద్రబాబు అనే కంటే బాలయ్య అసలు పట్టించుకోవడం లేదు.
బాలయ్య మాటకి తల వొగ్గి అందునా అలా బాబాయ్ అబ్బాయ్‌లు కలవడం ఎప్పటికైనా ముప్పేనని భావించే బాలయ్యను చంద్రబాబు వియ్యంకుడిని చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య, చంద్రబాబు ఇద్దరు లోకేష్ తదుపరి సీఎం అన్న పద్దతిలో సాగుతుంటే తమ వంశానికి చెందిన పార్టీ అంటే నందమూరి వారికి పేటెంట్ హక్కులున్న పార్టీ కాస్తా నారా వారిదైపోతూ ఉంటే జూనియర్, హరికృష్ణలు సమయం కోసం ఎదురుచూస్తున్నారనే సన్నిహితులు అంటున్నారు. ఆ అవకాశం ఏ రూపేణ వచ్చినా వారు వదులుకోరని కొడాలినాని ఉదంతమే తెలియజెప్పింది. ఇక విషయానికి వస్తే అంబికా కృష్ణను మీరు బాబాయ్ బాలకృష్ణని, అబ్బాయ్ ఎన్టీఆర్‌లను మరలా కలపడానికి మీరేమైనా పెద్దన్నయ్య పాత్ర పోషిస్తారా? అని అడగటంతో ఆయన ఎంతో తెలివిగా విషయం నుంచి తప్పుకున్నాడు.
'నేనెంతండీ, ఎందరో పెద్దలు, మేధావులు ఉన్నారు...ఆ పని మేధావులు చేయాల్సిందేనంటూ విషయాన్ని ఒక్క మాటలో తేల్చేసి తనను పెద్దన్నయ్య పాత్ర పోషించమని అడగవద్దని, తనను మేధావి అనకపోయినా, పెద్దనయ్యగా భావించకపోయినా తనకు బాధ లేదని, కానీ బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య నన్ను ఇన్‌వాల్వ్ చేయద్దు అంటూ 'ఢీ' సినిమాలో బ్రహ్మానందంలా నమస్కారం పెడుతున్నాడు. ఇక తమ కుటుంబం బ్యాంకులను మోసం చేయలేదని, 'అంబికా దర్బార్' ఎప్పుడు దివాలా తీయలేదని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నేటి చదువులు ఎందుకూ పనికిరావని తేల్చేశాడు. తన తండ్రి కేవలం మూడో క్లాస్ మాత్రమే చదివాడని, 25 రూపాయలతో ఈ బిజినెస్ మొదలుపెట్టాడని, తాను కూడా 10వ తరగతి వరకే చదువుకున్నానని,కాలేజీకి వెళ్లలేదన్న విషయాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు.