టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తన సమాకాలీనులందరినీ పక్కనపెట్టి రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్‌గా మారింది. అంతే కాదు తనకు సెంకడ్ హోమ్ హైదరాబాదేనని చెప్పి ఇక్కడ ఓ హౌస్ కూడా కొనేసింది. అయితే ఈ ఇంటిని ఒక హీరో ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చేశాడు అంటున్నారు. కానీ రకుల్ మాత్రం ఎవరో హీరో తనకు హౌస్‌ని గిఫ్ట్‌గా ఇస్తే తనెందుకు బ్యాంకులో లోన్ తీసుకున్నానని ఎదురు ప్రశ్నిస్తోంది.
మొత్తానికి ఇప్పటి వరకు ఈ అమ్మడి హవా బాగానే సాగుతూ వచ్చింది. దర్శకులు ఆ నటించిన చిత్రాలు ఫ్లాప్ అయినా, హీరోలు ఆమె సినిమాలు సరిగా ఆడకపోయినా ఆమెనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి విషయానికి వస్తే 'కిక్ 2' ఫ్లాప్ అయినా కూడా ఇదే భామను ఆయన 'ధృవ'లో కొనసాగించాడు. ఇక 'సరైనోడు' తర్వాత బోయపాటి శ్రీను ఆమెతోనే 'జయజానకి నాయకా' చిత్రం చేశాడు. 'పండగ చూస్కో' చిత్రంలో అమ్మడి మోజులో పడి గోపీచంద్ మలినేని తన 'విన్నర్'లో మరలా ఆమెకే చాన్సిచ్చాడు. ఇక మురుగదాస్ కూడా ఈమె వర్కింగ్ స్టైల్ నచ్చడంతో త్వరలో తాను తీయబోయే విజయ్ చిత్రంలో ఇదే భామను తీసుకోనున్నాడని సమాచారం.
ఇక హీరోలు కూడా అదే బాటలో ఉన్నారు. 'బ్రూస్‌లీ' డిజాస్టర్ అయిన తదుపరి 'ధృవ' చిత్రంతో ఆమెతోనే ఆడిపాడాడు రామ్ చరణ్. కార్తి ప్రస్తుతం ఈమెతో 'ఖాకి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈచిత్రం తర్వాత కార్తి నటించే చిత్రం కూడా సెట్ అయింది. ఈసారి ఆయన రజిత్ అనే దర్శకునితో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఇందులో కూడా రకుల్ ప్రీతే నటించనుంది. ఇక పెద్దగా హీరోయిన్లను రిపీట్ చేయని మహేష్ కూడా సి.అశ్వనీదత్, దిల్ రాజుల భాగస్వామ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి కూడా రకుల్‌నే అనుకుంటున్నట్లు సమాచారం.
ఆ విషయం పక్కనపెడితే ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్, సాయిపల్లవి వంటి వారు వరుసగా లైన్లలో ఉండటంతో పాటు పర్ఫెర్మెన్స్ పరంగా కావాలంటే కొందరు, కేవలం గ్లామర్ మాత్రమే కావాలంటే ఇంకొందరు, కానీ రెండు మిక్స్ చేసిన భామలు కూడా కావాలంటే కూడా రకుల్‌ని మించిన ఆప్షన్లు ఈమద్య మన దర్శకనిర్మాతలు, హీరోలకి పెరిగిపోతున్నాయి. కానీ తమన్నా, అనుష్క, కాజల్, శృతి హాసన్, సమంత వంటి వారి అవకాశాలు తగ్గిపోతు వస్తుండటం ఈ భామకి ప్లస్ అవుతుందా? లేక కొత్తవారి రాకతో మైనస్ అవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది..!