ఈ మధ్యన సీనియర్ నటీనటులు ఇప్పుడున్న తెలుగు సినిమా పరిశ్రమపై రకరకాల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోట శ్రీనివాసరావు పరభాషా నటులకు ఇచ్చే గౌరవం తెలుగు నటులకు ఇవ్వడం లేదన్నారు. అలాగే సీనియర్ నటి కవిత కూడా ఒకప్పుడు పెద్ద నటీనటులు కనబడగానే స్టార్ హీరోలైన లేచి నుంచునేవారని... కానీ ఇప్పుడున్న వారు ఎవరికీ గౌరవం ఇవ్వడంలేదన్నారు. అలాగే తనని మా అసోషియేషన్ అగౌరవపరిచిందని... దానికి తాను చాలా బాధ పడ్డానని ఒక ప్రముఖ ఛానల్ లో వచ్చిన షోలో కవిత కన్నీటిపర్యంతమయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా అలనాటి మేటి నటుడు కైకాల సత్యన్నారాయణ తెలుగు సినీ పరిశ్రమపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు సినిమా పరిశ్రమ అంటే కళలకు, నటీనటులకు ప్రాణం ఇచ్చేది.. కానీ ఇప్పుడున్న సినిమా పరిశ్రమ మొత్తం చాలా కమర్షియల్ గా తయారైందని వ్యాఖ్యానించారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.... అసలు ఎవరిని విమర్శించేందుకు మాత్రం కాదని చెప్పుకొచ్చారు. అలాగే తన సినిమా కెరీర్‌పై ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పిన ఆయన.. తనని అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులు ఆదరించారని చెబుతున్నారు. అంతే కాకుండా తాను విభిన్న రసాలను పండించడం వల్ల నవరస నట సార్వభౌమ బిరుదు ఇచ్చారన్నారు.
మరి సత్యన్నారాయణ ఇలా ఉన్నట్టుండి తెలుగు సినిమా పరిశ్రమ కమర్షియల్ గా తయారైందని ఎందుకు అన్నట్టు.. అసలు ఆయన మనుసులో ఉన్న బాధ ఏమిటనేది ఆయన బయటపెట్టలేదు.