'బాహుబలి' చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచిందని, ఈచిత్రం ద్వారా ప్రాంతీయభాషల్లోకి కూడా తెలుగు చిత్రాలను విడుదల చేసుకునే వెసులు బాటు ఉందని, అది 'బాహుబలి' సాధించిన ఘనత అని మన వారు చెబుతుంటారు. కానీ రెండో వైపు కోణంలో వారు ఆలోచించడం లేదు. ఏదైనా హీరో ఇతర ప్రాంతీయ భాషలు, బాలీవుడ్‌లో కూడా మార్కెట్ చేసేలా సిద్దమై, 'స్పైడర్'లాగా పెద్దగా కంటెంట్‌లేని సినిమాను ముందు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చుపెట్టిన నిర్మాతలు, ఏదో లాభాలను తెస్తుందని ఆశపడ్డ బయ్యర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రాక్టికల్‌గా, సరైన ధరకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునే దిల్‌రాజుకి ఏకంగా నైజాంలోనే దాదాపు 15కోట్ల వరకు నష్టం వస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది.
ఇక మురుగదాస్, మహేష్ కాంబినేషన్ చిత్రం పెట్టిన పెట్టుబడి, వచ్చిన రాబడిని పరిగణనలోకి తీసుకుంటే మహేష్ కెరీర్‌లో 'బ్రహ్మోత్సవం' కంటే 'స్పైడర్' పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. ఇక చిరంజీవి హీరోగా తన సొంత బేనర్‌లో రామ్‌చరణ్ నిర్మాతగా, కొణిదెల పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సై..రా.. నరసింహారెడ్డి'. ఈ చిత్రంతో 'బాహుబలి'ని ఢీకొట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకంగా నయనతార, అమితాబ్‌బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్ వంటి భారీ తారాగణంలో, ఏఆర్‌రెహ్మాన్ వంటివారికి కోట్లు ఇచ్చి పనిచేయిస్తున్నారు.
ఇక ఈ చిత్రం పీరియాడికల్ మూవీ కావడంతో నాటి పరిస్థితులు, కాస్ట్యూమ్స్, చెప్పుల కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్నారు. ఒక్క చెప్పులు, డ్రస్‌ల డిజైనింగ్‌కి మాత్రమే బాలీవుడ్ నుంచి నిపుణులను రప్పించి ఐదు కోట్లు ఖర్చుపెడుతున్నారట. మరి ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి? కానీ ఎవరు అవునన్నా.. కాదన్నా.. 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి' వంటి చిత్రాలే నిర్మాతలకు, బయ్యర్లకు శ్రేయస్కరమని నేటి తాజా పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది. 'బాహుబలి'ని లాడ్జ్ స్కేల్‌లో తీసినా కీరవాణి, ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్ వంటి వారిని పెట్టుకున్నారే గానీ రమ్యకృష్ణ, తమన్నా ల ప్లేస్ ముందు బాలీవుడ్ వైపు చూసినా చివరికి యూనిట్ పూర్తిగా సంగీతం సహా దక్షిణాది వారినే నమ్ముకుని తనని తాను నిరూపించుకున్న సంగతి మరువకూడదు....!